మూసీ సుందరీకరణ(Musi River Beautification)కు ప్రణాళికను రూపొందించమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. 2015-18 మధ్య మూసీకి రెండువైపులా చెత్త తొలగింపునకు, కొన్నిచోట్ల పూడికతీతకు బల్దియా రూ.80 కోట్లను ఖర్చు పెట్టింది. ఎక్కడా పూడిక తీయకపోయినా నిధులు వెచ్చించినట్లు లెక్కలు చూపించి, రెండొంతులకు పైగా జేబుల్లోకి వేసుకున్నారు. పైగా నదీ గర్భంలో రెండు వైపులా బల్దియా అధికారులే చెత్తను పారబోయిస్తుండడం గమనార్హం.
ఇదే సమయంలో నది సుందరీకరణ(Musi River Beautification)కు గాను ముందుకొచ్చిన మూసీ అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో నాగోలు, ఉప్పల్ ప్రాంతాల్లో నదీ గర్భంలో నడకదారులను అభివృద్ధి చేశారు. కొంతమేర సుందరీకరణ చేశారు. ప్రస్తుతం ఈ రెండు అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. మూసీలో కంపు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కొన్నిచోట్ల నది పక్కన నిమిషం ఉండలేని పరిస్థితి. పరివాహక ప్రాంతంలోని లక్షలమంది డెంగీ, మలేరియా జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వచ్చిన వరదలకు అభివృద్ధి పనుల్లో కొన్ని కొట్టుకుపోగా మరికొన్ని ధ్వంసమయ్యాయి.
వీటిని చక్కదిద్దితేనే..
- మూసీ నగరంలో 53 కి.మీ పొడవున ప్రవహిస్తుంది. నార్సింగి, లంగర్‌హౌజ్ వద్ద స్వచ్ఛంగా కన్పిస్తుంది. పీర్జాదిగూడ తర్వాత ప్రతాపసింగారం వద్ద పచ్చటి విషంలా, నురుగు కక్కుతుంది.
- లంగర్‌హౌజ్ తర్వాత ఆక్రమణలు కన్పిస్తాయి. బాపూఘాట్ వంతెన వద్ద బల్దియా స్వచ్ఛ ఆటోలు చెత్త పడేస్తున్నాయి. అక్కడి నుంచి అత్తాపూర్ వరకు రాత్రుళ్లు నిర్మాణ వ్యర్థాలను భారీగా పడేస్తున్నారు. వీటితో నది కుచించుకుపోతోంది.
- అత్తాపూర్, ఎంజీబీఎస్ మధ్య జంతు వ్యర్థాలు, చెత్తాచెదారంతో నింపి మూసీని కబళించే ప్రయత్నాలు సాగుతున్నాయి. జియాగూడ కబేళా వ్యర్థాలన్నింటినీ కొందరు నదిలో వేస్తున్నారు. పురానాపూల్, ఉస్మానియా ఆస్పత్రి ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలు, చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.
- నది మధ్యలో ఎంజీబీఎస్ ఉంటుంది. ఆ పక్కనే జీహెచ్‌ఎంసీ వ్యర్థాల తరలింపు కేంద్రం ఉంది. పాతబస్తీ, ఆ పరిసర ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే చెత్తను ఏళ్లుగా ఇక్కడికి తరలిస్తున్నారు. రెండు, మూడు రోజులు నిల్వ ఉంచి తరలిస్తుంటారు. వర్షాలు వచ్చినప్పుడు ఈ చెత్త నదిలోకి చేరుతోంది. చాదర్‌ఘాట్, ముసారాంబాగ్ వంతెనల వద్ద నీటి ప్రవాహానికి అడ్డుపడే చెత్త ఇక్కడిదేనని స్థానికులు చెబుతున్నారు.
- చాదర్‌ఘాట్, ఉప్పల్ మధ్య మూసారాంబాగ్, గోల్నాక ప్రాంతాల్లో వ్యర్థాలను పడేస్తున్నారు. కారు షెడ్లు, గుడిసెలు ఏర్పాటవుతున్నాయి. మూసారాంబాగ్ వద్ద బల్దియా అధికారులే సగం నదిని ఆక్రమించారు. అలీకేఫ్ వైపు వంతెనకు ఇరువైపులా టన్నుల కొద్దీ చెత్తకుప్పలు ప్రవాహానికి అడ్డుగా ఉండి, ఆ ప్రాంతం తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది.
ఇలా చేసి ఉంటే బాగుండేది..