తెలంగాణ

telangana

ETV Bharat / city

Ganesh Immersion: గణేశ్​ నిమజ్జనంపై గందరగోళం.. సుప్రీం తీర్పుపై ఆశాభావం - హుస్సెన్​సాగర్

హుస్సెన్​సాగర్​తో పాటు జంటనగరాల్లోని ఇతర జలాశయాల్లో పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనం చేయోద్దన్న హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపుతట్టింది. నిమజ్జనంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకుంటే నిమజ్జనం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. మరోవైపు గ్రేటర్​లో నిర్మించిన 25 నీటి కొలనులకు కూడా జీహెచ్ఎంసీ మరమ్మతులు పూర్తి చేసి నిమజ్జనానికి సిద్ధం చేస్తోంది.

ghmc-focus-on-ganesh-immersion-in-hussain-sagar
ghmc-focus-on-ganesh-immersion-in-hussain-sagar

By

Published : Sep 14, 2021, 10:42 PM IST

హైదరాబాద్​లో వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలో తర్జనబర్జన పడుతోంది. హైకోర్టు తీర్పుపై జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. తీర్పును సవరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇక సుప్రీంకు వెళ్లటమే మంచిదని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రేపు సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని, సానుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం గణేశ్​ ఉత్సవాలు, శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గుర్తు చేశారు.

గందరగోళంలో నగరవాసులు...

ఇక నిమజ్జనాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పష్టమైన సూచనలు లేకపోవడం.. హైకోర్టు ఆదేశాల గురించి ప్రజలకు తెలియకపోవడం వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చెరువుల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్​తో చేసిన, కెమికల్స్‌తో కూడిన రంగుల విగ్రహాలను నిమజ్జనం చేయరాదనే హైకోర్టు ఆదేశాలు తెలియని ప్రజలు ప్రతి సంవత్సరం మాదిరిగానే తాము ఎప్పుడూ నిమజ్జనం చేసే ప్రాంతాలకు విగ్రహాలతో వెళ్తున్నారు. నిమజ్జనానికి పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆ విగ్రహాలను నీళ్లలో వేయలేక.. అక్కడే వదిలి వెళ్లలేక వారంతా అయోమయానికి గురవుతున్నారు. వందలాది మంది దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో విగ్రహాలను తీసుకువచ్చి... తీరా నిమజ్జనానికి అనుమతి లేదని తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజులుగా ఇలాంటి ఘటనలతో పలు చెరువుల దగ్గర భక్తులు ఆందోళన కూడా చేశారు. హైకోర్టు తీర్పుతో పలు శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కోర్టు అనుమతించిన నీటి కొలనుల్లోనే నిమజ్జనాలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...

ఎక్కువ ఎత్తు ఉన్న గణపతులు సైతం కొలనుల్లోనే నిమజ్జనం చేసేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖైరతాబాద్, బాలాపూర్‌, ఇతర పెద్ద వినాయక విగ్రహాలను సైతం నీటి కొలనుల్లోనే నిమజ్జనం చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. సంజీవయ్యపార్కు, నెక్లెస్‌రోడ్​లో రెండు బేబీపాండ్స్‌ ఉన్నాయి. పెద్ద విగ్రహాలను కూడా వాటిల్లో నిమజ్జనం చేసేందుకు అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. అవరసరమైతే వీటిని మరింత పెద్దగా, లోతుగా చేయాలని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీహెచ్‌ఎంసీ, తదితర అధికారులు తలమునకలయ్యారు. నీటి కొలనుల్లో అన్ని విగ్రహాల నిమజ్జనం జరగాలంటే ఎక్కువ రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జాప్యం జరగకుండా ఉండేందుకు నీటి కొలనులను పూర్తిగా నీటితో నింపి, వాటిల్లో విగ్రహాలను తడిచేలా ముంచి వెంటనే తొలగించే చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

నిమజ్జనం కోసం నీటి కొలనులు..

గ్రేటర్ హైదరాబాద్​లో మొత్తం 25 నీటి కొలనులు నిర్మించారు. ఒక్కోటి 26 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు, 12– 15 అడుగుల లోతు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి పవర్‌ బోర్లతో నీరు నింపే సదుపాయం ఉంది. లేని వాటిని ట్యాంకర్లతో నింపుతున్నారు. కూకట్​పల్లిలోని అంబీర్‌చెరువు, రంగధాముని చెరువు, హస్మత్​పేట్​లోని బోయిన్‌చెరువు, కాప్రాలోని ఊరచెరువు, చెర్లపల్లి చెరువు, పెద్ద చెరువు, జీడిమెట్లలోని వెన్నెల చెరువు, రాయదుర్గంలోని మల్కచెరువు, నల్లగండ్ల చెరువు, మన్సూరాబాద్‌ చెరువు, నెక్నాంపూర్ పెద్దచెరువు, సూరారం లింగంచెరువు, మూసాపేట ముండ్లకత్వ చెరువు, అల్వాల్​లోని నాగోల్‌ చెరువు, కొత్తచెరువు, ఉప్పల్​లోని నల్లచెరువు, రాజేంద్రనగర్​లోని పత్తికుంట చెరువు, మియాపూర్​లోని గురునాథ్‌ చెరువు, లింగంపల్లిలోని పీచెరువు, ఆర్​సీపురంలోని రాయసముద్రం, హఫీజ్​పేట్ కైదమ్మకుంట, దుర్గంచెరువు, బండచెరువు, నెక్లెస్​రోడ్​లో రెండు నీటి కొలనులను నిర్మించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details