హైదరాబాద్ నగరంలో వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో 610 శిథిల భవనాలు ఉన్నాయని పట్టణ ప్రణాళిక విభాగం గుర్తించింది. ఈ సంవత్సరం జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటి వరకు 175 శిథిల భవనాలను కూల్చివేయగా.. మరో 84 భవనాలకు మరమ్మతులు చేశారు. 2020లో 231 శిథిల భవనాలను కూల్చివేయగా.. 129 భవనాలకు మరమ్మతులు చేసింది. వర్షాకాలంలో విపత్తుల నివారణలో భాగంగా శిథిల భవనాలను గుర్తించడం, పురాతన భవనాల పటిష్టత, భద్రతపై ఇంజనీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, అత్యంత ప్రమాదకరమైన భవనాలను కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం ఈ కార్యాచరణను చేపట్టింది.
నివాసితులకు కౌన్సిలింగ్
ఈ శిథిల ప్రమాదకరమైన భవనాల్లో ఉన్న నివాసితులు ఖాళీ చేయడానికి నిరాకరిస్తుండడంతో వారికి జీహెచ్ఎంసీ అధికారులు కౌన్సిలింగ్ చేపడుతున్నారు. అదేవిధంగా అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు ఆయా భవనాల చుట్టూ భారీ కేడ్లను అమర్చారు. ప్రమాదకరంగా ఉన్న శిథిల భవనాలు వర్షాల వల్ల కూలి ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉన్నందున ఈ భవనాల పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసితులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు.