గ్రేటర్ హైదరాబాద్ పీఠం ఎవరిదో తేల్చే .. 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. డివిజన్ల వారీ కౌంటింగ్ హాళ్లలో.. మొత్తం 166 కౌంటింగ్ టేబుళ్లలో లెక్కింపు చేపడుతున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. వీటిలో 85 స్థానాల్లో భాజపా అధిక ఓట్లు లభించాయి. అనంతరం బ్యాలెట్ పత్రాల మడతలు విప్పకుండా 25 చొప్పున కట్టలుగా కడుతున్నారు. వెయ్యి ఓట్ల చొప్పున ఉన్న 40 కట్టలను 14 టేబుళ్లకు ఇచ్చి లెక్కిస్తారు. ఒక్కో రౌండులో 14,000 ఓట్లు లెక్కిస్తారు. ప్రతి రౌండు అనంతరం కౌంటింగ్ ఏజెంట్ల సంతృప్తి మేరకు.. వారి సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. సందేహాత్మక బ్యాలెట్ పత్రాలను రిటర్నింగ్ అధికారి స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఇందుకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పరిశీలకుని అనుమతి తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారు.
ప్రస్తుతం వెలువడినవి పోస్టల్ ఓట్ల ఫలితాలు ఇలా ఉన్నాయి..
పోస్టల్ ఓట్ల లెక్కింపులో 85 చోట్ల భాజపాకు ఆధిక్యంలో నిలవగా.. 29 చోట్ల తెరాస, 17 చోట్ల ఎంఐఎం, 2 చోట్ల కాంగ్రెస్‌కు ఆధిక్యంలో ఉన్నాయి. పోస్టల్ ఓట్లలో 17 డివిజన్లలో ఎవరికీ ఆధిక్యం దక్కలేదు. కొన్ని డివిజన్లలో పార్టీలకు సరిసమాన ఓట్లు వచ్చాయి. మరికొన్ని డివిజన్లలో పోస్టల్ ఓట్లు నమోదు కాలేదు.
మధ్యాహ్నం మూడు గంటల్లోపు ..
మొదటగా పోలైన అన్ని ఓట్ల లెక్కను సరిచూస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. ప్రాథమిక లెక్కింపు మధ్యాహ్నం 12 గంటల్లోపు, మెజార్టీ వార్డుల పూర్తి లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల్లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.
మొబైల్ ఫోన్లను నిషేధం..
రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక్కో పరిశీలకుడిని నియమించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు. కౌంటింగ్ హాళ్లలో మొబైల్ ఫోన్లను నిషేధించారు. పాసులు లేని వారికి కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదు.
ఆర్వోదే నిర్ణయం..
ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ కోరాలనుకుంటే ఫలితం ప్రకటించడాని కంటే ముందే రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. వారు పేర్కొన్న కారణాలను పరిగణలోకి తీసుకొని రీకౌంటింగ్ విషయమై ఆర్వో నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిన డ్రా తీసి ఫలితాన్ని ప్రకటిస్తారు. బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చే వారంతా పీపీఈ కిట్లను ధరించాలని పేర్కొంది. కౌంటింగ్ సిబ్బంది మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పక ధరించాలని సూచించారు.
ఇవీ చూడండి: ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్