తెలంగాణ

telangana

ETV Bharat / city

నేతల మధ్య బస్తీమే సవాల్.. సత్తా చాటేందుకు ప్లాన్ - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

బల్దియా ఎన్నికలు కొందరు నేతలకు సవాలుగా మారాయి. ప్రతి ఒక్కరూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చెమటోడ్చుతున్నారు. పట్టు నిరూపించుకునేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థులను గెలిపించే విషయంలో అన్నీ తామై వ్యవహరిస్తున్నారు.

ghmc election 2020 victory
జీహెచ్​ఎంసీ విజయం వీరికి ముఖ్యం

By

Published : Nov 20, 2020, 7:44 AM IST

ఎక్కువ డివిజన్లు గెలవటమే కేటీఆర్ లక్ష్యం ‌

2016గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీ కేడర్‌కు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార బాధ్యతలు తన భుజానే వేసుకున్నారు. 99 డివిజన్లలో గులాబీ జెండా రెపరెపలాడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విస్తృతంగా పర్యటించారు. 4 స్థానాల్లో ఒక్క చోట(చేవెళ్ల) మాత్రమే తెరాస విజయం సాధించింది. మల్కాజిగిరిలో కాంగ్రెస్‌, సికింద్రాబాద్‌లో భాజపా, హైదరాబాద్‌లో ఎంఐఎం విజయఢంకా మోగించాయి. ఈ నేపథ్యంలోనే బల్దియా ఎన్నికలు కేటీఆర్‌కు సవాలుగా మారాయి. గతసారి కంటే ఎక్కువ డివిజన్లను గెలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

సత్తా చాటేందుకు కిషన్‌రెడ్డి ప్రయత్నాలు

త బల్దియా ఎన్నికల్లో అంబర్‌పేట్‌ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ తెరాస విజయం సాధించింది. శాసనసభ ఎన్నికల్లో అంబర్‌పేట్‌ నుంచి భాజపా తరఫున బరిలోకి దిగిన కిషన్‌రెడ్డి అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. గతయేడాది లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి గెలుపొంది కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు. భాజపా గ్రేటర్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గానూ ఉన్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 40 డివిజన్లలో అధిక శాతం గెలిచి సత్తా నిరూపించుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. భాజపా గెలిచేందుకు అవకాశమున్న డివిజన్లతోపాటు అంబర్‌పేట్‌ నియోజకవర్గంపై దృష్టి సారించారు.

రేవంత్‌ రెడ్డికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం

గ్రేటర్‌లోని ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా అందరి దృష్టి మల్కాజిగిరిపైనే పడింది. ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు శాసనసభ్యులు తెరాసకు చెందినవారే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన రేవంత్‌రెడ్డి 10వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పీసీసీ అధ్యక్షుడి రేసులో ఆయన పేరు వినిపిస్తోంది. బల్దియా ఎన్నికలు ఆయనకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇక్కడి మొత్తం 47 డివిజన్లలో 30 వరకు గెలిచి పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్‌ వెలువడక ముందే వరద సాయం పంపిణీలో అక్రమాలపై అధికారులను నిలదీశారు. ఆందోళనలకు దిగారు. అభ్యర్థులను దగ్గరుండి ఎంపిక చేశారు. అన్ని డివిజన్లను చుట్టొచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

తలసానికి సవాల్​గా మారిన బల్దియా పోరు

2014ఎన్నికల్లో సనత్‌నగర్‌ నుంచి తెదేపా తరఫున పోటీ చేసి గెలిచిన తలసాని.. ఆ తర్వాత తెరాసలో చేరారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి మళ్లీ మంత్రి అయ్యారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన కుమారుడు సాయికిరణ్‌యాదవ్‌ను బరిలోకి దించారు. అక్కడ భాజపా తరఫున పోటీ చేసిన కిషన్‌రెడ్డి గెలుపొందారు. దీంతో బల్దియా ఎన్నికలను తలసాని సవాలుగా తీసుకున్నారు.

మెజార్టీ స్థానాల కోసం అసదుద్దీన్ ఎత్తులు‌

2016 బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం 44 డివిజన్లలో విజయఢంకా మోగించింది. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాల్లో గెలుపొందింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి హైదరాబాద్‌ నుంచి అసదుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ గెలిచి తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. 44 డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను సమర్థంగా తిప్పి కొడుతూనే ఓటర్ల మద్దతును కూడగట్టేలా వ్యూహాలు సిద్ధం చేశారు.

ABOUT THE AUTHOR

...view details