GHMC Council Meeting Today: జీహెచ్ఎమ్సీ పాలకమండలి సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మూడు నెలలకోసారి సమావేశం జరగాల్సి ఉన్నా.. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు ఐదు నెలల తర్వాత బల్దియా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోంది. మొదటగా తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు. అనంతరం సభలో చర్చలు మొదలుపెట్టారు. ఈ చర్చల్లో తెలంగాణ సమైక్యత దినోత్సవం కాదు విమోచన దినోత్సవం అంటూ భాజపా అభ్యంతరం తెలిపింది. హైదరాబాద్‌లో వర్షం కురిస్తే ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ఉప్పల్ కార్పొరేటర్ రజిత తెలిపారు. ఎస్‌ఎన్‌డీపీ కింద పనులు నత్త నడకన సాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
అధికారపార్టీ అభివృద్ధి పనులపై ముందుకు..నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, నాలా విస్తరణ పనులు, ఫ్లై ఓవర్ల వంటి అంశాలను సభలో ఉంచాలని అధికార టీఆర్ఎస్ సభ్యులు సన్నద్ధమయ్యారు. ప్రతిపక్ష భాజపా నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు తమవంతుగా ప్రయత్నించాలని భావిస్తున్నారు. ఎంత ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించినా.. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పలు అభివృద్ది ప్రతిపాదనలను ఆమోదించి, పాలనపరమైన మంజూరీ కోసం సర్కారుకు పంపాలని అధికార తెరాస భావిస్తుంది.
మజ్లిస్ నేతల వ్యూహాలు..నగరంలో వర్షాకాలం ప్రజలెదుర్కొన్న సమస్యలు, దోమల వ్యాప్తి, డెంగీ వ్యాధి విజృంభణ వంటి అంశాలకు సంబంధించి అధికారుల వైఫల్యాలను సభలో లేవనెత్తాలని మజ్లీస్ సభ్యులు సన్నద్ధమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్షం కురిసినపుడల్లా పాతబస్తీలోని లోతట్టు ప్రాంతాలు ఎక్కువ నీట మునగడం, ముంపు నివారణ చర్యల్లో విఫలం కావడం, ఏళ్లు గడుస్తున్నా నాలాల విస్తరణ పనులు పూర్తి కాకపోవడంపై ఎంఐఎం కార్పోరేటర్లు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. అంతేకాదు స్టాండింగ్ కమిటీకి ఈవీడీఎం డైరెక్టర్ హాజరు కాకపోవటం, ఈవీడీఎం రద్దు కోసం ఇటీవల స్టాండింగ్ కమిటీలో జరిగిన చర్చను ప్రస్తావించాలని.. దాని రద్దు కోసం తీర్మానం చేసేలే ఒత్తిడి తేవాలని మజ్లీస్ నేతలు వ్యూహాలను సిద్దం చేస్తున్నారు.
భాజపా లేవనెత్తే అంశాలు..గ్రేటర్ హైదరాబాద్ లోని 150 డివిజన్లలో 47 డివిజన్లలో గెలుపొందిన బీజేపీ కార్పొరేటర్ల పట్ల స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రోటోకాల్ ను పాటించకపోవటంపైనే ప్రధానంగా ప్రశ్నించాలని సిద్దమవుతోంది. నిధుల లేక సివిల్ కాంట్రాక్టర్ల పనుల నిలిపివేత అంశాన్ని హైలెట్ చేసి అధికార టీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలని భాజపా భావిస్తోంది. జనరల్ బాడీ మీటింగ్ అంటే అధికార టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని.. ఒక అగ్నిపరీక్ష లాగా తప్పించకుంటోందని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. సర్వసభ్య సమావేశాన్ని కూడా ఒకరోజుకు పరిమితం చేయకుండా రెండు రోజులు నిర్వహించాలని డిమాండ్ చేయనుంది. గ్రేటర్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీకి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నా.. ఎక్కడా కూడా చీరల పంపిణీలో తమను ఆహ్వానించటం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల వినాయక నిమజ్జన ఏర్పాట్లలో కూడా బల్దియా విఫలమైందని.. డబుల్ బెడ్ రూం ఇళ్ల వెరిఫికేషన్ నిలిపివేతపై కూడా ప్రశ్నలు సంధించేందుకు బీజేపీ సన్నద్ధమైంది.