బల్దియా ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచినా.. హోదాలో చలామణి అవలేని పరిస్థితి. ప్రస్తుత పాలకమండలి గడువు ఇంకా ఉండటం వల్ల ప్రమాణ స్వీకారం చేయడానికి ఫిబ్రవరి 10వరకు వేచి చూడాల్సిందే. ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితులను కారణంగా చూపి పాలకమండలిని రద్దు చేయని పక్షంలో.. మరో 69 రోజులపాటు కొత్త అభ్యర్థులు అధికారికంగా కార్పొరేటర్లు కాలేరని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది. మేయర్ పదవి సైతం అప్పటి వరకు యథాతథంగా కొనసాగనుంది.
పీఠం ఎక్కాలంటే.. ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే...
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వింత పరిస్థితిని సృష్టించాయి. డిసెంబరు 4న కార్పొరేటర్లుగా గెలిచినప్పటికీ ఆ హోదాలో చలామణి అవలేని పరిస్థితి. ప్రస్తుతమున్న పాలకమండలి గడువు 2021 ఫిబ్రవరి 11వరకు ఉండటంతో.. గెలిచిన వారు అప్పటి వరకు ప్రమాణ స్వీకారం కోసం వేచి చూడాల్సిందే.
ప్రస్తుత పాలకమండలి ఫిబ్రవరి 11, 2016న ప్రత్యేక సర్వసభ్య సమావేశం ద్వారా కొలువుదీరింది. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం కొనసాగుతున్న పాలకమండలిని గడువులోగా రద్దు చేయడానికి వీల్లేదు. బలమైన కారణాలు ఉన్నప్పుడే రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ స్పష్టంగా ఉన్నప్పుడు మేయర్ పీఠానికి సకాలంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, ఇప్పుడు ఏ పార్టీకి ఆధిక్యం లేనందున జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏవేని రెండు పార్టీల మధ్య పొత్తు లేదా మద్దతుపై ఒప్పందాలు కుదిరాక సమయానికి నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అప్పటి వరకు కొత్తగా గెలిచినవారు.. అనధికారికంగా ప్రస్తుతం కొనసాగుతున్న వారు అధికారిక కార్పొరేటర్లుగా ఉండనున్నారు. 150 మందిలో 81 మంది కొత్తగా గెలిచినవారు కాగా మిగిలిన 69 మంది సిట్టింగ్ స్థానాల నుంచి గెలిచారు. మేయర్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తుందని, గ్రేటర్ పరిధిలోని ఏదేని జిల్లా కలెక్టరు ఆర్వో(రిటర్నింగ్ అధికారి) హోదాలో ఎన్నిక నిర్వహిస్తారని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది.
- ఇదీ చూడండి :ఆశల పల్లకీలో... గ్రేటర్ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ!