తెలంగాణ

telangana

ETV Bharat / city

GHMC BUDGET : వేల కోట్ల పద్దు.. అభివృద్ధే హద్దు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2021-22 వార్షిక బడ్జెట్(GHMC BUDGET) ​కు పాలకమండలి ఆమోదం తెలిపింది. 5600 కోట్ల రూపాయలతో బడ్జెట్​ను మేయర్ విజయలక్ష్మీ ప్రవేశపెట్టారు. కార్పొరేటర్లు కొత్తగా ఎన్నికైన ఆరు నెలల తర్వాత జరిగిన మొదటి సర్వసభ్య సమావేశం ఇది. కరోనా రెండో దశతో సమావేశం ఆలస్యమైందని జీహెచ్​ఎంసీ తెలిపింది. కరోనా నిబంధనల వల్ల వర్చువల్ పద్ధతిలోనే సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

GHMC, GHMC Ten, GHMC Budget 2021
జీహెచ్​ఎంసీ, జీహెచ్​ఎంసీ పద్దు, జీహెచ్​ఎంసీ బడ్జెట్ 2021

By

Published : Jun 30, 2021, 10:47 AM IST

జీహెచ్‌ఎంసీ పాలక మండలి సమావేశం నగరాభివృద్ధికి సంబంధించిన రూ. 5,600కోట్ల 2021-22 ఆర్థిక సంవత్సరం పద్దు(GHMC BUDGET)కు మంగళవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ద్వారా బల్దియా ఇంజినీరింగ్‌ విభాగం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్న రూ.1241కోట్ల అంచనాకూ పచ్చ జెండా ఊపింది. కార్పొరేటర్లు కొత్తగా ఎన్నికైన ఆరు నెలల అనంతరం జరిగిన మొదటి సర్వసభ్య సమావేశం ఇది. జాప్యానికి కొవిడ్‌ రెండో వ్యాప్తి కారణమని, కొవిడ్‌ నిబంధనల ప్రకారం వర్చువల్‌ విధానంలో ఈ సమావేశం నిర్వహించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. సమావేశానికి ముందు మేయర్‌ సమక్షంలో ఉపఎన్నిక ద్వారా ఇటీవల ఎన్నికైన లింగోజిగూడ కార్పొరేటర్‌ డి.రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విధానాలు, జీహెచ్‌ఎంసీ వైఫల్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పారిశుద్ధ్యంపై నిలదీత

గ్రేటర్‌లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంపై తెరాస నేతలతోపాటు, ఎంఐఎం, భాజపా, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు గళం వినిపించారు. అధికారులు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఎంఐఎం నేత, మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్‌ అందుకు బాధ్యత తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మాజిద్‌ హుస్సేన్‌, ఇతర కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. నాలాల ఆక్రమణలు, వానాకాలం సహాయక చర్యల్లో వైఫల్యం, రోడ్డు విస్తరణ వంటి అంశాలపైనా సభ్యులు అధికారులను నిలదీశారు.

పది రోజులు పట్టణ ప్రగతి..

రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు జులై 1 నుంచి 10 వరకు నగరంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తామని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సమావేశంలో ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదలకానున్న రూ. 936 కోట్లను పట్టణ ప్రగతికి ఖర్చు చేస్తామని బల్దియా తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి దఫా టర్మ్‌ లోన్‌ ద్వారా ఎస్సార్డీపీకి రూ.654.07 కోట్లు, రెండో దఫా టర్ము లోన్‌ ద్వారా సీఆర్‌ఎంపీకి రూ.621.18కోట్లు సేకరించామని బల్దియా ఆర్థిక విభాగం వెల్లడించింది.

తెరాస, భాజపా నగరాన్ని పట్టించుకోవట్లేదు..: రేవంత్‌రెడ్డి

రాజధాని నగరాన్ని తెరాస, భాజపా పట్టించుకోవట్లేదని, ప్రజలు అధిక సంఖ్యలో కార్పొరేటర్లను గెలిపించినా ఆ పార్టీ నేతలు సమస్యల గురించి పోరాటం చేయట్లేదని, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ఆయనకు అనుకూలంగా పని చేసే ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ భూ ఆక్రమణలకు వెన్నుదన్నుగా పనిచేస్తున్నారని ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన బల్దియా కార్యాలయం బయట మాట్లాడుతూ.. ‘‘గతేడాది వర్షాలు విధ్వంసం సృష్టిస్తే.. ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు లేవు. నాలాలకు రూ.858కోట్లతో పరిష్కారం చూపిస్తామన్నారు. ఒక్క పనీ చేయలేదు. గతేడాది నేరెడ్‌మెట్‌లో నాలాలో పడి సుమేధా అనే చిన్నారి, తాజాగా ఓ అబ్బాయి చనిపోయారు. పురపాలక శాఖ మంత్రిలో చలనం రావట్లేదు. మంత్రి కేటీఆర్‌ సెల్ఫీలు దిగుతుంటే, సీఎం కేసీఆర్‌ అసత్యాలతో వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకుంటున్నారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని మూసీ సంరక్షణ కోసం బోర్డు ఛైర్మన్‌గా నియమిస్తే.. ఆయనే ఆక్రమణలకు ఊతమిస్తున్నారు. జీహెచ్‌ఎంసీకి నిధులు ఇవ్వకపోవడంతోపాటు చెల్లించాల్సిన పన్ను కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. అతిపెద్ద పన్ను ఎగవేతదారు ప్రభుత్వమే. నాగార్జున కూడలిలో ఓ బహుళ అంతస్తుల భవనం కోసం అక్కడున్న మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని పక్కకు జరిపారంటేనే బల్దియా పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

2021-22 పద్దు ఇలా (రూ.కోట్లలో)..

రెవెన్యూ ఆదాయం 3571.00

రెవెన్యూ వ్యయం 2414.00

రెవెన్యూ మిగులు 1157.00

మూలధన రాబడులు 983.04

మొత్తం 5600.00

మూలధన వ్యయాలు 3186.00

ABOUT THE AUTHOR

...view details