Ghee manufacturing centre: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను, దేశీయ ఆవుపాలతో నెయ్యి తయారు చేసి స్వామివారి కైంకర్యాలకు వాడనున్నట్లు.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తితిదే ఎస్వీ గోసంరక్షణ శాలలో నెయ్యి తయారీ కేంద్రానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామివారి ఆలయంలో కైంకర్యాలకు, దీపారాధన, అన్న ప్రసాదాల తయారీకి రోజుకు 60 కిలోల నెయ్యి అవసరం అవుతుందని చెప్పారు. ముంబయికి చెందిన అఫ్కాన్స్ సంస్థ రూ.3కోట్ల వ్యయంతో నెయ్యి తయారీ ప్లాంట్ నిర్మించనుందని తెలిపారు. గోశాలలోని దేశీయ గోవుల నుంచి రోజుకు 4వేల లీటర్ల పాలను సేకరించి నెయ్యి తయారీ కేంద్రానికి ఇస్తారని చెప్పారు.
దేవుణ్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు..మూడు రోజులకు ముందు జరిగిన భక్తుల తోపులాట గురించి విలేకరులు ప్రశ్నించగా ప్రధాన ప్రతిపక్షం, దానికి వంతుపాడుతున్న మీడియా దేవుడ్ని సైతం రాజకీయాల్లోకి లాగుతోందన్నారు. సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో కొంత తోపులాట జరిగినా దేవుడి దయవల్ల ఎవరికి ప్రాణాపాయం జరగలేదన్నారు. ఘటన జరిగిన గంటలోపే టోకెన్లు లేకుండా భక్తులను తిరుమలకు అనుమంతిచేలా అధికారులకు ఆదేశాలు జారీచేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని వెల్లడించారు. తెదేపా పాలనలో ఇలాంటి ఘటనలు జరగలేదా, భక్తులు కంపార్టుమెంటు గేట్లు విరిచిన సంఘటనలు గుర్తులేవా అని ప్రశ్నించారు. భక్తుల సౌకర్యార్థం మరో రెండు అన్నప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈవో జవహర్‌రెడ్డి, ఎస్వీ గోశాల సంచాలకులు డాక్టర్ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.