డెంగీ, మలేరియా లాంటి అనేక రకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల(Hospitals)కు పరుగులు తీస్తున్న పేద రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందుబాటులోకి రావడం లేదు. దీనికి కారణం గాంధీ, టిమ్స్‌లాంటి అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు మొదలుపెట్టకపోవడమే. కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులు తగ్గిపోవడంతో వీటికి చికిత్స అందిస్తున్న భాగ్యనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 2896 పడకలు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత ఆస్పత్రుల్లో సాధారణ రోగాలకు చికిత్స అందించే విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
మొదటి దశ కరోనా తీవ్రత తగ్గిన వెంటనే గాంధీతోపాటు ఇతర ఆస్పత్రుల్లో వెంటనే సాధారణ రోగులకు వైద్యం మొదలుపెట్టారు. అదే రెండో దశలో కరోనా తీవ్రత చాలా వరకు తగ్గిపోయినా కూడా ఆస్పత్రులన్నింటిని ఖాళీగానే ఉంచుతున్నారు తప్ప సాధారణ రోగాలకు వైద్యం అందించే విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. గాంధీలో 1711 పడకలు ఖాళీగా ఉన్నాయి. రోజువారీ వచ్చే బ్లాక్‌ఫంగస్, కరోనా రోగుల సంఖ్య 40 వరకు ఉంటోంది. ఇందులో 70 శాతం ఫంగస్ కేసులే ఉంటున్నాయి. లైబ్రరీ భవనంలో దాదాపు 250 పడకలున్నాయి. కరోనా రోగులను అక్కడికి తరలించి మిగిలిన పడకల్లో సాధారణ రోగులకు వైద్యం అందించడానికి అవకాశం ఉంది. మరో ముఖ్యమైన గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో కూడా ప్రస్తుతం 80 మంది కరోనా రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లో కూడా వందలాది పడకలు ఖాళీగానే ఉన్నాయి.
ఒక్క రోగి లేకుండానే..
ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రిలో దాదాపు 250 పడకలుంటే అన్నీ ఖాళీగానే ఉన్నాయి. పాతబస్తీలోని మరో ఆయుర్వేద ఆస్పత్రి, అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆయుర్వేద ఆస్పత్రుల్లో పక్షవాతం రోగులకు చక్కటి వైద్యం అందుతోంది. అనేకమంది రోగులు ఈ ఆస్పత్రులకు వచ్చినా కరోనా చికిత్స మాత్రమే చేస్తున్నామంటూ తిప్పి పంపుతున్నారు.