శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంపై జెన్కో అంతర్గత కమిటీ విచారణ ప్రారంభించింది. మంగళవారం.. విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లను నిశితంగా పరిశీలించింది. నాలుగో యూనిట్‌కు భారీగా నష్టం వాటిల్లిందని... ఆరో యూనిట్‌లోని ప్యానెల్ బోర్డు పూర్తిగా కాలిబూడిదైందని నిపుణుల కమిటీ గుర్తించింది. ఒక్కో విభాగంలో పూర్తిగా తిరుగుతూ అన్ని వివరాలను సేకరించింది. ఘటనాస్థలంలో ఇంజనీర్లు, ఉద్యోగులు, బ్యాటరీలు బిగించే వాళ్లు మృతిచెందిన ప్రదేశాన్ని.. నిశితంగా పరిశీలించింది. ఆరు ట్రాన్స్ఫార్మర్లు, ఆరు జనరేటర్లను క్షుణ్ణంగా పరిశీలన చేసింది.
అప్పుడే విద్యుత్ ఉత్పత్తి..
ప్రమాదం జరిగినప్పుడు ప్లాంట్ ట్రిప్ కాకపోవడానికి గల కారణాలను ఎస్పీడీసీఎల్ ఛైర్మన్ రఘుమారెడ్డి, వెంకటరాజం, జగత్ రెడ్డి, సచ్చితానందం బృందం.. ఆరా తీసింది. 1,2,3,5 యూనిట్లలో పెద్దగా ప్రమాదం జరగలేదని.. వాటిని 30 నుంచి 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చి.. విద్యుదుత్పత్తి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది.
భారీగా ఊటనీరు..
విద్యుత్ కేంద్రంలోకి భారీగా ఊటనీరు వస్తుంది. 10 హెచ్‌పీ మోటార్లు, నాలుగు 15 హెచ్‌పీ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని బయటకు ఎత్తిపోస్తున్నారు. బుధవారం మరో 80హెచ్‌పీ పంపును కూడా ఏర్పాటుచేస్తామని జెన్కో కమిటీ తెలిపింది. ఈ పంపుతో వేగంగా నీటిని బయటకు పంపించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతోంది. నీరు తొలగిస్తేనే ప్లాంట్ పునరుద్ధరణ పనులు త్వరితగతిన జరుగుతాయని అధికారులు తెలిపారు.