ఏపీలో రెండు దశల్లో పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ సన్నాహాలు చేస్తోంది. వ్యర్థాల సేకరణపై ప్రజల నుంచి వసూలు చేసే ప్రతిపాదిత రుసుముల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదటి దశలో 16 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రెండో దశలో మిగతా పురపాలక సంఘాల్లో అమలు చేయనున్నారు.
ఈ నెల 15న కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఏపీలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లోనూ నివాసాలు, నివాసేతరాల నుంచి వ్యర్థాలు సేకరించి వినియోగ రుసుములు వసూలు చేయాలన్న నిర్ణయంపై ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. పలు చోట్ల పురపాలక పాలకవర్గ సభ్యులు సైతం కరోనా వేళ వినియోగ రుసుముల వసూళ్ల ప్రతిపాదనలను వ్యతిరేకించారు.
తొలి దశలో 90 డివిజన్లు, వార్డుల్లో అమలు
తొలి దశలో 16 నగరపాలక సంస్థలు, 29 స్పెషల్, సెలక్షన్, ఫస్ట్ గ్రేడ్ పురపాలక సంఘాల్లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పుర, నగరపాలక సంస్థకు రెండు చొప్పున ప్రయోగాత్మకంగా 90 డివిజన్లు, వార్డుల్లో అమలు చేస్తారు. వీటిలో ఫలితాల ఆధారంగా మిగతా డివిజన్లు, వార్డులకు కార్యక్రమాన్ని విస్తరిస్తారు. రెండో దశలో మిగతా 68 ప్రథమ, ద్వితీయ, తృతీయ గ్రేడ్ పురపాలక సంఘాల్లో, నగర పంచాయతీల్లో వ్యర్థాలు సేకరించి ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేయనున్నారు.
పాలకవర్గం ఆమోదం కోసం ఆదేశాలు
రెండు దశల్లో చేపట్టనున్న పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమం అమలు కోసం ఇప్పటికీ పాలకవర్గం అనుమతి తీసుకోని చోట వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం పొందాలని పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. తొలి దశలో క్లాప్‌ని ప్రారంభించే నగరపాలక సంస్థల్లో, స్పెషల్, సెలక్షన్, ఫస్ట్ గ్రేడ్ పురపాలక సంఘాల్లో వెంటనే పాలకవర్గం అనుమతి తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న నిర్వహించే విజయవాడ నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశానికి సంబంధించి అజెండాలో అధికారులు వినియోగ రుసుములను ప్రతిపాదించారు. నివాసాల సంఖ్య, వ్యర్థాల సేకరణకు అయ్యే రవాణా ఖర్చులను బట్టి ఒక్కో చోట ఒక్కో విధంగా వినియోగ రుసుములను కమిషనర్లు ప్రతిపాదిస్తున్నారు.
ఇదీచూడండి:ప్లాట్లుగా మారిపోతున్న చెరువులు.. కాలనీలను ముంచెత్తుతున్న వరదలు