వృద్ధులు.. వితంతువులు.. వికలాంగులకు ఇస్తున్న వైఎస్సార్ పింఛను కానుక నగదులో కోత పెడుతున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండే పింఛను సొమ్ములో చెత్త పన్ను వసూలు చేసి లబ్ధిదారులకు గుండె కోత మిగుల్చుతున్నారు. పురపాలిక సిబ్బంది, వాలంటీర్లు కలిసి చేస్తున్న నిర్వాకంతో కొందరు పింఛనుదారులు కన్నీరుమున్నీరయ్యారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాల్టీల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెత్త పన్ను కట్టకపోతే అమ్మఒడి, ఇతర పథకాలు రద్దు చేస్తారంటూ వాలంటీర్లు బెదిరింపులకు దిగారు.
ఎమ్మిగనూరులో రూ.2 లక్షలు :ఎమ్మిగనూరు మున్సిపాల్టీలో 34 వార్డులు ఉండగా, 9,450 మంది పింఛనుదారులున్నారు. తొలిరోజు 8,434 మందికి పింఛన్ల సొమ్ము పంపిణీ చేశారు. చెత్తపన్ను చెల్లించనివారి జాబితా తీసుకొని పారిశుద్ధ్య సిబ్బంది, వాలంటీర్లు బయలుదేరారు. పింఛను ఇచ్చే ముందు ఆ ఇంటిపై ఎన్ని నెలల చెత్త పన్ను బకాయి ఉందో అంత కోత విధించి మిగిలిన సొమ్ము చేతికి ఇస్తున్నారు. ఎమ్మిగనూరు పురపాలిక పరిధిలో ఒక్కరోజే రూ.2 లక్షల చెత్త పన్ను వసూలు చేశారు.
ఆదోనిలో రూ.65 వేలు :ఆదోని మున్సిపాల్టీ పరిధిలో పింఛను నగదులో చెత్త పన్ను పోను మిగిలింది చేతికిచ్చారు. 42 వార్డుల్లో 16వేల మంది పింఛనుదారులు ఉన్నారు. నెలకు రూ.45 చొప్పున బకాయిలున్న ఇళ్లకు వెళ్లి వసూలు చేశారు. ఈ మున్సిపాల్టీలో ఒక్కరోజే చెత్తపన్ను రూపంలో రూ.65వేలు ఖజానాకు వచ్చింది.