ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో మత్తు పదార్థమైన గంజాయినివిక్రయించే ముఠాలు ఎప్పటికప్పుడు తమ దందా పద్ధతిని మార్చుకున్నాయి. పొడి గంజాయిని ప్యాకెట్లలో తరలించడంకన్నా ద్రవంగా మారిస్తే రవాణా సులభంగా ఉండటంతోపాటు లాభాలూ అధికంగా ఉంటాయని గుర్తించిన ముఠాలు.. యంత్రాలను వినియోగించి గంజాయిని ద్రవంగా మార్చేస్తున్నాయి. దీన్ని ఏపీలోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నాయి. ఇటీవల కాలంలో ధ్రవ రూపంలో గంజాయిని తరలించి విక్రయించడం పెరిగింది.
ప్రమాదం ఎక్కువే..
పొడి గంజాయి కంటే ద్రవ రూపంలోకి మారిన తరువాత ఈ మత్తు పదార్థంతో ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. ఎండిన గంజాయి ఆకులను ద్రవంగా మార్చేందుకు పెట్రోలుతో పాటు విషపూరిత రసాయనాలను వినియోగిస్తుంటారు. దీన్ని హెసిస్ ఆయిల్‌గా పిలుస్తుంటారని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు చెబుతున్నారు. హుక్కా పీల్చే అలవాటు చాలా రాష్ట్రాల్లో ఉంది. హుక్కాలో కొన్ని చుక్కలు ద్రవ గంజాయి వేస్తుంటారు. విశాఖ ధారకొండ ప్రాంతంలో ఈ ద్రవరూప గంజాయిని తయారు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లాలో చిక్కిన నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. జి.మాడుగుల, సీలేరు, మరికొన్ని ప్రాంతాల్లో యంత్రాలను ఉపయోగించి ఈ మత్తు పదార్థానికి కొత్త రూపాన్ని ఇస్తున్నారు. 2015లో నర్సీపట్నం పరిధిలో టాస్క్‌ఫోర్స్ అధికారులు ఓ రోజు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఒకే రోజు 11 మంది నల్లమందు లాంటి ద్రవ పదార్థంతో దొరికారు. దీన్ని రసాయన విశ్లేషణకు పంపిస్తే గంజాయినే నల్లమందుగా తయారు చేసినట్లు వెల్లడైంది.