తెలంగాణ

telangana

ETV Bharat / city

మత్తులో పేట్రేగుతున్న మృగాళ్లు.. మహిళలపై సామూహిక అత్యాచారాలు - Gang Rapes in AP

Gang Rapes in AP : మన పక్క రాష్ట్రం ఏపీలో వరుసగా చోటుచేసుకుంటున్న సామూహిక అత్యాచార ఘటనలకు మద్యపానం ప్రధాన కారణమవుతోంది. ఆయా ఘటనల్లో నిందితులు పూటుగా మద్యం సేవించి.. ఆ మైకంలో ఉచ్ఛనీచాలు మరచి దుశ్చర్యలకు తెగబడుతున్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అత్యాచార ఘటనల్లో అరెస్టవుతున్న నిందితుల్లో  60 శాతం మంది వరకూ మద్యం మత్తులో ఉన్నప్పుడే ఆ పైశాచిక చర్యకు పాల్పడుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

Gang Rapes in AP
Gang Rapes in AP

By

Published : May 3, 2022, 9:25 AM IST

Updated : May 3, 2022, 9:43 AM IST

మత్తులో పేట్రేగుతున్న ఉన్మాదులు.. వరుసగా సామూహిక అత్యాచార ఘటనలు

Gang Rapes in AP : ఆంధ్రప్రదేశ్​లో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలకు మద్యపానం ప్రధాన కారణమవుతోంది. ఆయా ఘటనల్లో నిందితులు మందు తాగి ఆ మైకంలో ఉచ్ఛనీచాలు మరచి దుశ్చర్యలకు తెగబడుతున్నారు. మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేపల్లె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

60 శాతం మంది మత్తులోనే.. :సామూహిక అత్యాచార ఘటనల్లో అరెస్టవుతున్న నిందితుల్లో 60 శాతం మంది వరకూ మద్యం మత్తులో ఉన్నప్పుడే ఆ పైశాచిక చర్యకు పాల్పడుతున్నారు. పలు అధ్యయనాలూ ఇదే విషయం చెబుతున్నాయి. ‘మత్తులో ఉన్నప్పుడు వారికి విచక్షణ ఉండదు. తమ చర్యలపై నియంత్రణ ఉండదు. పశువాంఛ బయటపడుతుంది. ఈ క్రమంలో అమానుష చర్యలకు తెగబడుతుంటారు. అలాంటి సందర్భాల్లో బాధితులు ఎవరైనా వారిని ఎదిరించినా, వారి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినా మరింత రెచ్చిపోతారు. హింసాత్మక చర్యలకు దిగుతారు’ అని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఒకరికి.. ఇద్దరు ముగ్గురు కలిసి.. :మద్యం మత్తులో ఉండే వ్యక్తికి అదే మైకంలో ఉన్న మరో ఇద్దరు, ముగ్గురు తోడైతే వారి విచ్చలవిడి ప్రవర్తనకు అడ్డూ అదుపే ఉండదు. అలాంటి సందర్భాల్లో వారికి నిస్సహాయంగా, ఎదురించలేని స్థితిలో మహిళలు ఎవరైనా కనిపిస్తే అఘాయిత్యానికి తెగబడుతున్నారు. తాను ఒక్కడినే కాదని.. తనతో పాటు మరికొందరు ఉన్నారన్న భరోసాతో మరింతగా రెచ్చిపోతున్నారు.

  • మద్యం తాగని వారితో పోలిస్తే.. మత్తులో ఉన్న వారిలో దూకుడు స్వభావం అధికం. విపరీత ధోరణి ఉంటుంది. ఇది నేరాలకు దారి తీస్తోంది.
  • విపరీత ప్రవర్తన, సమాజంపై ద్వేష భావం ఉండేవారికి మద్యం మత్తు తోడైతే అది తీవ్రమైన నేరాలకు కారణమవుతుంది.
  • ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ యువకుడు మద్యం మత్తులో కన్నతల్లిపైనే అత్యాచారానికి యత్నించాడు. అడ్డుకున్న తండ్రిపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన తల్లిని బండరాయితో మోది చంపేశాడు.
  • అనంతపురం జిల్లాలో 33 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో కన్నతల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎంత వారించినా వినకపోవటంతో తల్లిదండ్రులు అతడిని చంపి పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు.
  • లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో కన్న కుమార్తెపైనే అత్యాచారయత్నం చేసిన ఘటన కొన్నాళ్ల కిందట ఏలూరు జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది.

కట్టేసి కొట్టి.. సామూహిక అత్యాచారం:స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మచిలీపట్నం తాలూకా కరగ్రహారం శివారు పల్లిపాలెం బీచ్‌లో నెల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులిద్దరూ మద్యం మత్తులో.. ఆ యువతి స్నేహితుడిని కట్టేసి మరీ అతని ఎదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

సీఎం జగన్‌ నివాసానికి అత్యంత సమీపంలో ఉన్న సీతానగరం పుష్కర్‌ ఘాట్‌కు.. కాబోయే భర్తతో కలిసి విహారానికి వెళ్లిన యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనకు పాల్పడక ముందు నిందితులు మద్యం, గంజాయి తాగి ఉన్నారు. ఆ మత్తులో ఓ వ్యక్తినీ హతమార్చారు.

తీవ్రత వెలుగు చూడట్లేదు:మహిళలపై లైంగిక నేరాలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో మద్యం మత్తులో ఉన్నవారెందరు? ఎన్ని కేసుల్లో మద్యం ప్రభావం ఉంది?.. దీనిని సంబంధించిన గణాంకాల్ని జాతీయ నేర గణాంక సంస్థగానీ, రాష్ట్ర నేర గణాంక సంస్థగానీ విడుదల చేయట్లేదు. లైంగిక నేరాలకు మత్తు ఎలా కారణమవుతోందో విశ్లేషించే సహేతుక అధ్యయనం చేపట్టట్లేదు. దీంతో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నా.. వెలుగు చూడట్లేదు. రాష్ట్రంలో మద్యం గొలుసు దుకాణాలన్నింటినీ మూసివేయించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. పల్లెటూళ్లలోనూ కావాల్సినంత మద్యం లభిస్తోంది. దీనిని తోడు ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి లభ్యత బాగా పెరిగింది. కౌమార దశలోనే చాలా మంది వీటికి అలవాటు పడిపోతున్నారు. చెడు సావాసాలతో మత్తులో మునిగి నేరాలకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వాలు బాధ్యత వహించి తీరాలి:‘ఖజానా నింపడానికి మద్యం అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలు, ఆ మత్తులో జరిగే నేరాలకు బాధ్యత వహించి తీరాలి. ఆ నేరాల్ని పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి’ అని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.ఆనంద్‌ వెంకటేశ్‌ 2019 మార్చిలో తీర్పు ఇచ్చారు. ‘మద్యం మత్తులో నిందితులు చేసే నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత?’ అంటూ ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం.

విచక్షణ మరచి...: 'మద్యం మత్తులో ఉన్నవారు విచక్షణ కోల్పోతారు. తాము చేస్తున్న చర్యల పర్యవసానాల గురించి ఆలోచించరు. మత్తు ఎక్కువయ్యే కొద్దీ వారిలో పశు ప్రవృత్తి బయటపడుతుంది. మద్యం మత్తులో లేని వ్యక్తితో పోలిస్తే.. మత్తులో ఉండే వ్యక్తి నేరాలకు పాల్పడే అవకాశాలు అనేక రెట్లు ఎక్కువ. మద్యం మత్తు విచక్షణను చంపేస్తుంది. లైంగిక నేరాలకు మద్యం మత్తూ కారణమవుతుంది'.

-డాక్టర్‌ ఎన్‌.ఎన్‌.రాజు, భారతీయ మానసిక వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షుడు

ఇదీ చదవండి..

Viral Video: ఇల్లు అద్దెకు కావాలని వచ్చారు... అక్కడే ఆగలేకపోయారు..

గుడ్​న్యూస్.. భానుడి భగభగల నుంచి కాస్త రిలీఫ్​.. మంగళవారమే మొదలు!

Last Updated : May 3, 2022, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details