Ganesh Immersion Route Map in Hyderabad: భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్దమైంది. శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గణపతి విగ్రహాల ప్రధాన ఊరేగింపు కేశవగిరి నుంచి చాంద్రాయణ గుట్ట మీదుగా ఫలక్ నామా - ఆలియాబాద్ - నాగల్‌చింత - చార్మినార్ - అప్జల్ గంజ్- ఎంజె మార్కెట్ - అబిడ్స్ - బషీర్ బాగ్ - అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్ వైపు సాగుతోంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు రాష్ట్రపతి రోడ్డు - కర్బలా మైదానం - ముషీరాబాద్ - ఆర్టీసీ క్రాస్ రోడ్ - హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి. హైదరాబాద్ తూర్పు మండలం నుంచి వచ్చే విగ్రహాలు ఉప్పల్ - రామాంతపూర్ - ఛే నంబర్ - దుర్గాభాయ్ దేశ్ ముఖ్ ఆస్పత్రి - ఫీవర్ ఆస్పత్రి - నారాయణగూడ మీదుగా వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.
దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలు ఐఎస్‌సదన్ - సైదాబాద్ - చంచల్‌గూడ మీదుగా వచ్చే పెద్ద విగ్రహాల ఊరేగింపులో కలుస్తాయి. తార్నాక నుంచి వచ్చే వాహనాలు ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్, అడిక్ మెట్ మీదుగా ఫీవర్ ఆస్పత్రి వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి. టోలి చౌకి, మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు మాసబ్ ట్యాంక్ - నిరంకారి భవన్ - సైఫాబాద్ పోలీస్ స్టేషన్ - ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు వెళతాయి. ఎస్‌ఆర్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చే విగ్రహాలు మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపులో కలుస్తాయి. టపాచబుత్ర, సీతారాంబాఘ్, గోషామహాల్ బండారి, నుంచి వచ్చే విగ్రాహాలు ఎంజె మార్కెట్ వద్ద కలుస్తాయి. ఊరేగింపు జరిగే మార్గాల్లో రేపు ఉదయం ఆరు గంటల నుంచి శనివారం ఉదయం పది గంటల వరకు ఇతర వాహనాలను దారి మళ్లించనున్నారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి రాకపోకలు సాగించే లారీలను ఆదివారం ఉదయం వరకు నగరంలోకి అనుమతించరు. ప్రధాన ఊరేగింపు సాగే మార్గాల్లో విగ్రహాలు తీసుకువస్తున్న వాహనాలకు తప్ప ఏ ఇతర వాహానాలకు అనుమతించమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలన్నారు.