తెలంగాణ

telangana

ETV Bharat / city

12 వేల మంది పోలీసులు.. 22 క్రేన్లు.. గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు - ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు

Ganesh Immersion Arrangements in Hyderabad: హైదరాబాద్‌లో అంబరాన్నంటేలా జరిగే గణేశ్‌ నిమజ్జనాల కోసం సర్వం సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌ వద్ద జీహెచ్​ఎంసీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. నగరంలో చెరువుల వద్ద కూడా భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతకు చర్యలు చేపట్టారు. వినాయక నిమజ్జనాల దృష్ట్యా జంట నగరాలు, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

Ganesh Immersion Arrangements in Hyderabad
Ganesh Immersion Arrangements in Hyderabad

By

Published : Sep 8, 2022, 12:37 PM IST

Updated : Sep 8, 2022, 6:40 PM IST

Ganesh Immersion Arrangements in Hyderabad : హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 22 క్రేన్లు ఏర్పాటు చేశారు. వ్యర్థాల వెలికితీతకు 20 జేసీబీలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సామూహిక నిమజ్జనానికి అవసరమైన భారీ వాహనాలు, డీసీఎంలు, ట్రాలీలను మండపాల నిర్వాహకులకు రవాణా శాఖ అధికారులు సమకూర్చుతున్నారు. నెక్లెస్‌రోడ్‌లో వాహనాల పూలింగ్ కేంద్రం వద్ద ఆర్టీవో రామచంద్ర నాయక్ వాహనాలు ఇప్పించారు. నగర వ్యాప్తంగా మొత్తం 13 చోట్ల వాహనాల పూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

సునిశిత ప్రాంతాల్లో అదనపు బలగాలు..:హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో 12 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. శోభాయాత్ర మార్గంలో అత్యవసర సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచారు. పాతబస్తీలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. సునిశిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్‌ సెంటర్ నుంచి వినాయక నిమజ్జనాన్ని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ పర్యవేక్షించనున్నారు. గణేశ్‌ శోభాయాత్ర ఊరేగింపు జరిగే ప్రధాన మార్గమైన ఎంజే మార్కెట్ ప్రాంతాన్ని సీవీ అనంద్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు..: సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఎల్బీనగర్ డీసీపీ పరిధిలోని సిబ్బందితో సమావేశమై.. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్బీనగర్ పరిధిలోని మన్సురాబాద్‌ చెరువులో నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లను జీహెచ్​ఎంసీ అధికారులు పూర్తి చేశారు. దుర్గం చెరువు, రాయదుర్గం మల్కం చెరువులో భారీ క్రేన్‌లను సిద్ధం చేశారు. కూకట్​పల్లిలోని ఐడియల్ చెరువు వద్ద ఆరు క్రేన్లు ఏర్పాటు చేశారు. 200 మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది, 100 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. నగర శివారులోని ఘట్‌కేసర్‌, మేడ్చల్, శామీర్‌పేట్‌ పరిధిలోని చెరువుల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు కూడా చర్యలు చేపట్టారు.

మెట్రో రైళ్ల సమయం పొడిగింపు..: హైదరాబాద్‌లో గణేశ్​ శోభయాత్రను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే 8 ఎంఎంటీఎస్​ రైళ్లు నడుపుతుండగా.. ఆర్టీసీ 565 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. రేపు ఉదయం 6 నుంచి అర్ధరాత్రి రాత్రి 2 వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చివరి స్టేషన్ నుంచి అర్ధరాత్రి ఒంటిగంటకు మెట్రో బయలుదేరనుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది.

పరీక్షలు వాయిదా..: మరోవైపు కాళోజీ వర్సిటీ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వ సెలవు దృష్ట్యా పరీక్షలు వాయిదా వేశారు. ఎంబీబీఎస్ మైక్రో బయాలజీ పరీక్ష ఈ నెల 19కి వాయిదా పడింది. ఈ నెల 21న బీడీఎస్ పెరియోడెంటాలజీ పరీక్ష ఉండగా.. ఈ నెల 30న పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఇంగ్లీష్ పరీక్ష జరగనుంది. ఈ నెల 12 నుంచి జరగాల్సిన పరీక్షలన్నీ యాథాతథంగా కొనసాగనున్నాయి.

మద్యం దుకాణాలు బంద్​..: రేపు నగరంలో గణపతి నిమజ్జనం దృష్ట్యా మద్యం షాపులు మూతపడనున్నాయి. 3 కమిషనరేట్‌ల పరిధిలో రేపు ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Sep 8, 2022, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details