హైదరాబాద్‌లో ఘనంగా జరిగే గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. మండపాలను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు.. విగ్రహాలను తరలిస్తున్నారు. నగరంలో రోడ్లపై విగ్రహాల తరలింపునకు సంబంధించిన వాహనాలతో కోలహలం నెలకొంది. పూజాసామగ్రి కోసం ప్రజలు రోడ్లపైకి రావటంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కిక్కిరిసిపోయాయి.
విగ్రహాల తయారీకి ప్రధాన కేంద్రం దూల్‌పేట. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు.. ఇతర రాష్ట్రాలకు కూడా విగ్రహాలు తీసుకెళ్తూంటారు. చివరి నిమిషం వరకు కూడా ఇక్కడ కొనుగోళ్లు జరుగుతుంటాయి. అయితే ఈసారి కరోనా భయాలు ఇంకా సమసిపోకపోవటం వల్ల... గణనాథుల తయారీ అంతంతమాత్రంగానే చేశారు. సాధారణంగా ఏడాది మొత్తం చేసే విగ్రహాల తయారీ... ఈసారి కేవలం రెండు నెలల్లోనే చేశారు. దీని వల్ల విగ్రహాల సంఖ్య బాగా తగ్గిపోయింది. చాలా మంది ఇప్పటికే కొనుగోలు చేశారు. భారీ గణనాథులు ఇప్పటికే మండపాలకు చేరుకున్నారు. చిన్న విగ్రహాలు మాత్రమే కొనుగోలుకు ఉన్నాయి.
"ఇరవై ఏళ్ల నుంచి దూల్‌పేటకు వస్తున్నాం. ఇక్కడే గణపతి విగ్రహాలు కొంటాం. ఇక్కడికి వస్తేనే పండుగ వాతావరణం కనిపిస్తుంది. రోడ్లన్ని గణపతులతో సందడిగా ఉంటుంది. ఈసారి మాత్రం విగ్రహాలు ఎక్కువగా లేవు. పెద్ద గణేశ్‌ల సంఖ్య తక్కువుంది. చిన్న వినాయకుల రేట్లు ఎక్కువున్నాయి. కోవిడ్ వల్ల లేబర్ లేక తక్కువ సంఖ్యలో తయారు చేశామని దుకాణదారులు చెబుతున్నారు. ముడి సరుకుల రేట్లు పెరగటం వల్ల విగ్రహాల రేట్లు కూడా పెరిగాయంటున్నారు." -కొనుగోలుదారు