Ganesh Chaturthi 2022: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పర్వదినాన్ని కన్నుల పండువగా జరుపుకొంటారు. భారతీయ సమాజంలో వినాయకచవితికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది. ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు. గణనాథుని కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. జ్యోతిషశాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడి ఆరాధనలో కుజుడు, బుధుడు, కేతు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుంది. విఘ్నేశ్వరుడు ధూమకేతు గణాధ్యక్షుడు, మోక్ష కారకత్వానికి అధినాయకుడు కావడంతో కేతు గ్రహానికి అధిపతి అయ్యాడని, బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞానప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కలుగుతుందని, అలాగే, కుజ గ్రహం అనుగ్రహం వివాహ, అన్యోన్య దాంపత్యానికి చిహ్నం. ఒక్క పార్వతీ తనయుడిని ఆరాధించడం వల్ల ఈ మూడు గ్రహాల అనుగ్రహం పొందవచ్చని జ్యోతిషశాస్త్రం పేర్కొంటోంది.
వినాయకుడిని ఎందుకు ఆరాధించాలి?
విఘ్నేశ్వరుడంటేనే విఘ్నములను తొలగించువాడు అని అర్థం. విఘ్నాలు తొలగాలన్నా, దృష్టి దోషములు పోవాలన్నా, ఆటంకాల నుంచి రక్షణ పొందాలన్నా, విద్య, బుద్ధి, సిద్ధి ప్రాప్తి కలగాలన్నా, బుద్ధి వికాసానికి, వ్యాపారాభివృద్ధికి, మోక్ష ప్రాప్తికి విఘ్నేశ్వరుడి ఆరాధన కచ్చితంగా చేయాలని పురాణాలు చెబుతున్నాయి.
పూజకు ఎలాంటి విగ్రహాన్ని వాడాలి?
మన ఇంట్లో నిత్యం చేసుకొనే పూజలకు బొటనవేలికి మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. వినాయక చవితి వంటి వ్రతములు చేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవడం మంచిది. ఎంతపెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారంగా రోజూ ఆ స్థాయిలో ధూపదీప నైవేద్యములు జరగాలి గనక సాధారణంగా ఇంట్లో చేసుకొనే పూజకు అరచేతికి మించకుండా విగ్రహం వాడటం మంచిది. సిద్ధివినాయక పూజలో వాడే విగ్రహం మట్టితో చేసినదైతే శ్రేష్ఠం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి విగ్రహాలు వాడకూడదు. పూజలో మట్టి విగ్రహం గానీ, పంచలోహములతో చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలి.
పూజ ఎలా చేసుకోవాలి?
ప్రతి ఒక్కరూ వినాయకచవితి కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి. ఆ పర్వదినాన తెల్లవారు జామునే లేచి ఇంటిని, పూజగదిని శుభ్రపరిచి తలస్నానమాచరించాలి. కొత్త బట్టలు ధరించి ఇంటిని, పూజా మందిరాన్ని పసుపు, కుంకుమ, తోరణాలతో అలంకరించాలి. విఘ్నేశ్వరుడిని పెద్దలందరితో కుటుంబమంతా కలిసి కూర్చొని పూజామందిరంలోగానీ, తూర్పు, ఉత్తరం, ఈశాన్య భాగాలలో విగ్రహాన్ని ఉంచి దానిపైన పాలవెల్లి కట్టి ఆపై వినాయకుడికి ఇష్టమైన ఎనిమిది లేదా 16 రకాల పండ్లను కట్టి ఆయన్ను షోడశ లేదా అష్టోత్తర శత నామాలతో 21 రకాల పత్రాలతో పూజించాలి. వినాయక పూజ అనంతరం కుడుములు, ఉండ్రాళ్లు, కజ్జికాయలు, పండ్లు, ఇతర ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించాలి. కుటుంబమంతా వినాయక చవితి వ్రతకల్పంలో చెప్పిన విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఐదు కథలను చేతిలో అక్షింతలు తీసుకొని భక్తి శ్రద్ధలతో ఆలకించాలి. అనంతరం కథా అక్షింతలు తలపై చల్లుకొని ఇంటి పెద్దల ఆశీర్వచనం పొందాలి.
వినాయక పూజకు వాడే పత్రిలో దాగి ఉన్న రహస్యమేంటి?