రాష్ట్ర వ్యాప్తంగా వినాయకచవితి సంబరాలు కోలహలంగా జరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లో...
వినాయకచవితిని పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ తొలిపూజ నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి... సికింద్రాబాద్ గణేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆలయమని మంత్రులు పేర్కొన్నారు.
నిర్మల్‌లో..
నిర్నల్ జిల్లా కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నెలకొల్పిన కర్ర గణపతి వద్ద దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తొలి పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. విఘ్నేశ్వరుని కృపతో కరోనా వెళ్లిపోయి.. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి కోరుకున్నారు.
జగిత్యాలతో..
జగిత్యాలలో వినాయక చవితి సందడి మొదలైంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు. మెట్పల్లిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విత్తనాలు కలిగిన మట్టి వినాయకుల ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు.
హనుమకొండలో..
హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ దంపతులతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ ప్రారంభించారు. అనంతరం.. కాళోజీ కూడలి వద్ద ఆయాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాలను వినయ్‌భాస్కర్ పంపిణీ చేశారు.
హనుమకొండ జిల్లా ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలో వినాయక చవితి పర్వదిన వేడుకలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. 16 రోజుల పాటు గణేశ్ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.