ఉదయం 9 గంటల కొచ్చి పీపీఈ కిట్ వేసుకుంటే.. వార్డులన్నీ తిరగడానికి మూణ్నాలుగు గంటలు పట్టేది. మండుటెండల్లో పీపీఈ కిట్ ఒక అరగంట వేసుకుంటేనే చెమటతో శరీరం తడిసి ముద్దయ్యేది. చెమట చుక్కలు తల నుంచి కారుతూ కళ్లలో పడుతుండేవి. కళ్లు తుడుచుకోవడానికి కూడా వీల్లేని స్థితి. అయినా సరే.. ప్రతి రోగిని రోజూ పలకరించేవాణ్ని. రోగులు కూడా నా కోసం ఎదురు చూడడం సంతృప్తినిచ్చిన విషయం. డిశ్ఛార్జి అయ్యాక మళ్లీ వచ్చి నా ఫొటో తీసుకెళ్లిన వారూ ఉన్నారు.
- డాక్టర్ రాజారావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్
ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబంలో పెద్దావిడ(98)కు కొవిడ్ సోకింది. అప్పటికి ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సలను అనుమతించకపోవడంత వల్ల ఈ వృద్ధురాలిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు నిమోనియా కూడా ఉంది. పరిస్థితి సంక్లిష్టమేనని అందరూ భావిస్తున్న దశలో గాంధీ వైద్యుల కృషితో ఆమె అనూహ్యంగా కోలుకున్నారు. కొవిడ్ తగ్గినా, భయంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు. ఈ విషయం పెద్దావిడకు తెలియదు. ‘మా వాళ్లను పిలవండి. నేను ఇంటికి వెళతాను’ అని అడిగేవారు. వైద్యులు పదే పదే చెప్పినా.. కుటుంబ సభ్యులు ముందుకురాలేదు. చివరికి పోలీసుల జోక్యంతో ఆ వృద్ధురాలిని తీసుకెళ్లారు. కానీ వారింటికి కాదు.. వృద్ధాశ్రమానికి.
ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. కొవిడ్‌ను జయించినా, కుటుంబసభ్యుల పాషాణ హృదయాలను గెలవలేకపోయిన వృద్ధులెందరో... మరికొందరు వృద్ధులు తమంతట తామే ఇళ్లకు వెళ్లకుండా రోడ్లపైనే గడిపారు. ఇలాంటి వృద్ధుల కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి సపర్యలు చేశాం.
కొవిడ్ తొలికేసు నమోదై ఏడాది గడిచింది. ఒక్కసారి వెనక్కి వెళ్తే అప్పటి పరిస్థితులు...
దుబాయి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక యువకుడి(23)లో తొలి కేసు నమోదైంది. తీవ్రమైన భయాందోళనల మధ్య ఎన్ 95 మాస్కు, పీపీఈ కిట్ ధరించి రోగి చెంతకు వెళ్లేవాళ్లం.
2009లో స్వైన్‌ఫ్లూ విజృంభించినప్పుడు ఇలాగే చికిత్స చేసిన అనుభవం ఉపయోగపడింది. వారం రోజుల్లోనే ఆ యువకుడు కోలుకున్నాడు. తర్వాత క్రమేణా కేసులు పెరగడంతో ‘గాంధీ’ని ప్రభుత్వం కొవిడ్ ఆసుపత్రిగా ప్రకటించింది.
చికిత్సలో వైద్యసిబ్బంది పాత్ర
కొవిడ్ బాధితులకు చికిత్స చేయడం సవాలే. వైద్యులు, నర్సులు, సహాయకులు, నాలుగో తరగతి సిబ్బంది.. ఇలా అందరికీ వారం పని చేస్తే, మరో వారం సెలవులు ఇచ్చాం. దీంతో సిబ్బందిని సర్దుబాటు చేయడం కష్టమయ్యేది. అయినా సరే, అందరూ చాలా ధైర్యంగా, సమర్థంగా పనిచేశారు. తొలినాళ్లలో కొందరు వృద్ధులు బాత్రూముకు వెళ్లి అక్కడే సొమ్మసిల్లి పడిపోయినవారున్నారు. అటువంటి వారికి పడక వద్దే అన్నింటినీ సమకూర్చేవాళ్లం. వారికి డైపర్స్ వేయడం, మార్చడం అన్నీ మా సిబ్బందే చేసేవాళ్లు.