గాంధీ ఆసుపత్రిలో అధికారికంగా 1050 పడకలుంటే.. రోగుల తాకిడి మేరకు 2200 పడకలు ఏర్పాటు చేసి దాదాపు అన్ని రోగాలకు చికిత్స అందిస్తున్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించగా.. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా వైద్యసేవలు అందుతున్నాయి. మార్చి ఒకటో తేదీన గాంధీ ఆసుపత్రిలో మొదటి కరోనా కేసు నమోదైంది. దీన్ని వైద్యులు ఎంతో సమర్థంగా ఎదుర్కొని, బాధితుడిని సురక్షితంగా ఇంటికి పంపించారు.
అలుపెరగని రీతిలో..
రాష్ట్రంలో కరోనాకు ఈ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. రోజురోజుకు వైరస్ బారినపడిన వారి సంఖ్య పెరుగుతున్నా.. అలుపెరగని రీతిలో సేవలందిస్తున్నారు ఇక్కడి సిబ్బంది. బాధితుల్లో మనోస్థైర్యం నింపుతూ... బలవర్ధకమైన ఆహారం, తగిన మందులతో చికిత్స చేస్తున్నారు.
కమిటీలదే బాధ్యత..
కరోనా బాధితుల నుంచి ఆసుపత్రికి వచ్చే ఇతరులకు వైరస్ సోకకుండా పాలనా యంత్రాంగం జనరల్ ఓపీని రద్దు చేసింది. క్రమక్రమంగా అత్యవసర, గైనకాలజీ, జనరల్ సర్జన్, ఆర్ధోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ తదితర విభాగాలను, వాటిలోని రోగులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం గాంధీ నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్ చేసే డీ-మెడ్ విభాగం మాత్రమే ఉంది. మిగిలినదంతా కరోనా చికిత్సలకే కేటాయించారు. బాధితులు, అనుమానితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్ వైద్యులు, సిబ్బందితో మొత్తం 16 కమిటీలను ఏర్పాటు చేశారు.