అనంతకుమార్ రెడ్డి స్వస్థలం ఏపీలో ప్రకాశం జిల్లాలోని చినగంజాం. ఇతనికి చిన్నప్పటి నుంచి క్రీడలంటే విపరీతమైన ఇష్టం. కానీ.. పుట్టిన ఊరిలో ఎలాంటి క్రీడా సదుపాయాలు ఉండేవి కాదు. అయినా.. తన ఇష్టమే తనను నడిపించి.. జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌గా తీర్చిదిద్దింది.
సాయ్‌లో సీటు
అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకునేందుకు అనంత కుమార్ కుటుంబ నేపథ్యం సహకరించలేదు. నిరుపేదలైన తల్లిదండ్రుల నుంచి డబ్బులు ఆశించలేకపోయాడు. అతనిలోని ప్రతిభతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సీటు సంపాదించాడు. పశ్చిమ గోదావరిలోని ఏలూరు కేంద్రంలో రెండేళ్లు శిక్షణ పొందాడు. ఆ సమయంలోనే తనలోని క్రీడాకారుడికి మరింత మెరుగులు దిద్దుకున్నాడు అనంత్ కుమార్.
పేద పిల్లలకు శిక్షణ
అనంతరం.. పంజాబ్‌లోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్- పాటియాలాలో క్రీడా శిక్షకుడిగా శిక్షణ పొందాడు. జాతీయ స్థాయి సంస్థలో విద్యాభ్యాసం చేయడంతో.. ఉద్యోగ అవకాశాలు వరుసకట్టాయి. వేల రూపాయల జీతంతో మంచి ఉద్యోగాలు అతని గుమ్మం తట్టాయి. కానీ.. వాటిన్నింటినీ కాదనుకున్నాడు. తనలాంటి పేద పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు అనంతకుమార్.
12 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో
రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు సాధించిన అనంత్ రెడ్డి.. 12 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఆ అనుభవాన్ని పేద క్రీడాకారుల అభ్యున్నతికి వినియోగించి.. వాళ్లను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ధ్యేయమంటున్నాడు. అందుకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెబుతున్నాడు.