తెలంగాణ

telangana

ETV Bharat / city

Central Minister Shekhawat: కృష్ణాపై అనుమతుల్లేని ప్రాజెక్టులను ఆపేయాలి - కృష్ణాపై అనుమతుల్లేని ప్రాజెక్టులను ఆపేయాలి

కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో చేపట్టే ప్రాజెక్టులకు అనుమతులు లేకపోతే తక్షణం ఆపేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. గతనెల 15న జారీచేసిన కృష్ణా నదీ యాజమాన్య మండలి నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. నోటిఫికేషన్‌ వెలువడిన 6నెలల్లోగా నిబంధనల ప్రకారం అనుమతులు తెచ్చుకోవాలన్నారు. లేనిపక్షంలో  ప్రస్తుతం కొనసాగుతున్న అనుమతిలేని ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా లేదా పాక్షికంగా ఆపేయాల్సి ఉంటుందన్నారు. గురువారం లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానాలు ఇచ్చారు.

Central Minister Shekhawat
Central Minister Shekhawat

By

Published : Aug 6, 2021, 8:18 AM IST

ప్రశ్న: ఏ ప్రాజెక్టులకైనా కేంద్ర ప్రభుత్వం గాని, దాని ఆధ్వర్యంలోని సంస్థలు గాని నిధులు సమకూరుస్తున్నాయా? కేంద్రం నుంచి నిధులు అందుకున్నవాటిలో అనుమతిలేని ప్రాజెక్టులు కూడా ఉన్నాయా?

జలవనరుల ప్రాజెక్టుల ప్రణాళికలు, నిధులు, అమలు, నిర్వహణ బాధ్యతలను వనరుల లభ్యత, ప్రాధాన్యతల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సాయం అందిస్తుంది. సుస్థిర అభివృద్ధి, జలవనరుల సమర్థవినియోగం కోసం సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం (ఏఐబీపీ)లాంటి పథకాల ద్వారా ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన కింద సాయం చేస్తుంది. దీనికితోడు, పెట్టుబడి అనుమతులున్న భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణంలో పురోగతి సాధించిన ప్రాజెక్టులను నిబంధనలను అనుసరించి ఏఐబీపీలో చేర్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. 2016-17లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 99 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను పీఎంకేఎస్‌వై-ఏఐబీపీ కింద చేర్చాం. రూ.77,595 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా 76.03 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ఈ 99 ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మద్దిగడ్డ రిజర్వాయర్‌, గుండ్లకమ్మ, తారకరామ రిజర్వాయర్‌, ముసురుమిల్లి, పుష్కర ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతలు, తోటపల్లి బ్యారేజీ, ఎర్రకాల్వ రిజర్వాయర్‌ ప్రాజెక్టులు చోటు సంపాదించుకున్నాయి. తెలంగాణ నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌-2, మత్తడివాగు, జె.చొక్కారావు, పెద్దవాగు (నీల్వాయ్‌), పెద్దవాగు (జగన్నాథ్‌పుర్‌), రాజీవ్‌ భీమా లిఫ్ట్‌ఇరిగేషన్‌, రెళ్లివాగు, పాలెంవాగు, ఇందిరమ్మ ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌, గొల్లవాగు రిజర్వాయర్‌, కుమురం భీం ప్రాజెక్టులున్నాయి.

ప్రశ్న: అనుమతులు లేని ప్రాజెక్టులకు నిధులు ఇచ్చే వ్యవస్థను సరిదిద్దే ప్రణాళిక కేంద్రం వద్ద ఉందా?

కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల పరిధిని నిర్దేశిస్తూ జులై 15న నోటిఫికేషన్‌ జారీచేశాం. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన అధికారాలను అనుసరించి ఈ రెండు బోర్డులు సమర్థంగా పనిచేస్తాయని అంచనావేస్తున్నాం.

తెలంగాణకు 34%, ఏపీకి 66% కృష్ణా జలాలు

కృష్ణా నీటిని 2017-18 సంవత్సరానికి తెలంగాణ 34%, ఆంధ్రప్రదేశ్‌ 66% వాడుకోవడానికి 2017 నవంబరు 4న జరిగిన 7వ బోర్డు మీటింగ్‌లో రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకరించాయని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లోక్‌సభలో తెలిపారు. 2019-20, 2020-21 సంవత్సరాల్లో వరదలు వచ్చినప్పటికీ ఇరు రాష్ట్రాల అంగీకారంతో అదే నిష్పత్తిలో నీటిని పంచుకోవాలని నిర్ణయించారని తెలిపారు. కృష్ణా బోర్డు నోటిఫికేషన్‌, విద్యుత్తు ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం, వరద నీటి లెక్కింపు తదితర అంశాలపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 87(1)కింద దఖలుపడిన అధికారాలను ఉపయోగించే కేంద్ర ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య మండలి పరిధిని నిర్దేశిస్తూ జులై 15న నోటిఫికేషన్‌ జారీచేసిందన్నారు.

ఇదీ చూడండి:pulichinthala: పులిచింతల ఘటన.. నిర్మాణ లోపాలే ప్రధాన కారణాలు

ABOUT THE AUTHOR

...view details