గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపు విషయంలో హైకోర్టు ఆదేశాలను అధికారులు ధిక్కరిస్తున్నారని... ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సాయంతో తమను బయటకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 19న వరకు గడ్డి అన్నారంలో పండ్ల క్రయ విక్రయాలకు అనుమతించాలని హైకోర్టు చెప్పినా.. తమను మార్కెట్లోకి అనుమతించడం లేదని తెలిపారు. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే సుప్రీంను ఆశ్రయిస్తామని కమిటీ తెలిపింది.
హైకోర్టు ఏం చెప్పిందంటే..
బాటసింగారం తాత్కాలిక మార్కెట్లో సదుపాయాల పరిశీలనకు న్యాయవాది వినయ్‌కుమార్‌ను కోర్టు కమిషనర్‌గా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ తరలింపుపై హోల్‌సేల్ ఫ్రూట్ మార్కెట్ ఏజెంట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న (నవంబర్ 16) విచారణ జరిగింది. బాటసింగారం మార్కెట్ లో తగిన సదుపాయాలు కల్పించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. బాటసింగారం తాత్కాలిక మార్కెట్ కు వెళ్లేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. సదుపాయాలు కల్పించకుండానే బలవంతంగా తరలిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వ్యతిరేకించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారని... హైకోర్టు ఆదేశించినా... గడ్డి అన్నారం మార్కెట్లో వ్యాపారాలకు అనుమతించడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం... బాటసింగారంలో సదుపాయాలు పరిశీలించి.. ఈనెల 19న నివేదిక ఇవ్వాలంటూ న్యాయవాది వినయ్‌కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు గడ్డి అన్నారంలో వ్యాపారాలు అనుమతించాలన్న మధ్యంతర ఉత్తర్వులను ఈనెల 19 వరకు పొడిగించింది.