వ్యవసాయ మార్కెట్ల పటిష్ఠానికి ఆత్మనిర్భర్ భారత్(atmanirbhar Bharat scheme) పథకం కింద భారీగా రుణాలిస్తామని కేంద్రం.. రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు తాజాగా తెలిపింది. గ్రామాల్లోని వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి వీటిని వాడుకునే వీలుంది. తెలంగాణకు రూ.3075 కోట్లు, ఏపీకి రూ.6,540 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ప్రాథమిక కేటాయింపులు జరిపింది.
రూ.లక్ష కోట్లతో ఏఐఎఫ్
పథకం కింద ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(ఏఐఎఫ్)ని రూ.లక్ష కోట్లతో ఏర్పాటుచేసింది.ఈ నిధిని బ్యాంకులు రుణాలుగా ఇస్తాయి. ప్రభుత్వ శాఖలు, సంస్థలే కాక ప్రైవేటు సంస్థలూ వీటిని తీసుకోవచ్చు. గ్రామాల్లో ఉండే ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఈ రుణాలు తీసుకుని అభివృద్ధి పనులు చేయవచ్చు. ఒక్కో సంఘానికి రూ.2కోట్ల వరకూ రుణమిస్తారు. తిరిగి చెల్లించేటప్పుడు వడ్డీలో 3శాతాన్ని నాబార్డు భరిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో రూ.165కోట్ల వరకూ రుణాలు తీసుకోవడానికి 200కి పైగా సంఘాలు దరఖాస్తులిచ్చినట్లు బ్యాంకర్లు తెలిపారు.
ఆదాయం లేని మార్కెట్లకు ఉపయోగం
వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి ఇంతకాలం మార్కెటింగ్ శాఖ వద్ద ఉండే ‘మార్కెట్ సెస్’ నిధినే వినియోగిస్తున్నారు. రైతులు పంటలను అమ్మడానికి మార్కెట్లకు తెచ్చినప్పుడు కొన్న వ్యాపారులు వాటి విలువలో ఒక శాతం సొమ్మును సెస్ కింద అక్కడి కమిటీకి చెల్లించాలి. ఇలా 2020-21లో రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్లకు రూ.400 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నిధుల నుంచే మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించడంతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్నారు.
తెలంగాణలోని 192 మార్కెట్లలో 40 వరకూ తగిన ఆదాయం లేక అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఇలాంటివాటికి ఏఐఎఫ్ రుణాలు ఉపయోగపడతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.ఈ రుణాలందుకోవడానికి ప్రభుత్వం మార్కెట్లకు ఇంకా అనుమతించలేదు. ఒక్కో మార్కెట్ వారీగా ఎంత రుణం కావాలి? ఏయే అభివృద్ధి పనులు చేస్తారు, వాటితో రైతులకు కలిగే మేలేమిటనే సమగ్ర ప్రాజెక్టు నివేదికలిస్తే రుణాలు మంజూరుచేస్తామని ఓ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కింద వడ్డీ రాయితీ వస్తుందని వివరించారు. తెలంగాణ మార్కెటింగ్‌శాఖ నుంచి తమకు ఇంతవరకూ ప్రతిపాదనలేమీ రాలేదని ఆయన చెప్పారు.