తెలంగాణ

telangana

ETV Bharat / city

Ganesh Chaturthi 2022: చవితి వేడుకల్లో చిన్నారులకూ భాగం కల్పించండిలా.. - పిల్లల కోసం వినాయక చవితి కార్యక్రమాలు

Ganesh Chaturthi 2022: వినాయక చవితి అంటేనే పిల్లల పండగ.. ఒకప్పుడు పూజకి అవసరమైన పత్రి దగ్గర్నుంచి పూలు, పండ్లు.. అన్నీ వారే వూరు- వాడ, కొండ-కోన గాలించి మరీ సేకరించి తీసుకొచ్చేవారు. కానీ రాన్రానూ ఈ పద్ధతుల్లో మార్పు వచ్చింది. పత్రులు, పువ్వులు.. మొదలైనవి సేకరించడం మాట పక్కన పెడితే అసలు వాటి గురించి కూడా ఇప్పటి పిల్లలకు ఏమాత్రం అవగాహన లేదు. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా బుజ్జాయిలతో ప్రత్యేకంగా కొన్ని పనులు చేయించడం ద్వారా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. మరి, అవేంటో చూద్దామా?

Ganesh Chaturthi
Ganesh Chaturthi

By

Published : Aug 30, 2022, 7:38 PM IST

Ganesh Chaturthi 2022: సాధారణంగా వినాయకచవితి రోజు ప్రత్యేకమైన పూజా మండపం ఏర్పాటు చేసి, గణనాథుని ప్రతిమని ప్రతిష్టించి పూలు, పండ్లు, పత్రులతో పూజించడం పరిపాటి. అయితే చిన్నారులను ఈ పూజతో పాటు, అందుకు సంబంధించిన పనుల్లో కూడా భాగస్వాములను చేయాలి. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా బుజ్జాయిలతో ప్రత్యేకంగా కొన్ని పనులు చేయించడం ద్వారా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. మరి, అవేంటో చూద్దామా..

పూజాసామగ్రి సేకరణ..లంబోదరునిగా, ఆది దేవునిగా పేరున్న వినాయకుడిని చవితి రోజున ఏకవింశతి పత్రాలతో పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకోసం 21 రకాల పత్రులను సేకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 21రకాల పత్రుల పేర్లు, వాటికి ఉన్న ఔషధ గుణాల గురించి చిన్నారులకు వివరించండి. ప్రత్యేకించి వినాయక చవితి రోజున ఆయా పండ్లు, పూలు మొదలైనవి ఎందుకు వినియోగిస్తామో వారికి తెలియజేయండి.

మట్టి గణపతి తయారీ..ప్రకృతిని పరిరక్షించే నేపథ్యంలో ప్రస్తుతం అంతా మట్టితో చేసిన గణపతి విగ్రహాలకే ఓటేస్తున్నారు. మీరూ అంతేనా?? అయితే ఈసారి విగ్రహాన్ని కొనకండి. దానికి బదులుగా.. మీ చిన్నారులనే ఒక విగ్రహాన్ని తయారుచేయమని చెప్పండి. వారికి మార్గదర్శకంగా ఉండేందుకు అంతర్జాలంలో ఉన్న వీడియోలను చూపించండి. వాటి ఆధారంగా అందుబాటులో ఉన్న పర్యావరణహితమైన పదార్థాలతోనే గణపతి ప్రతిమని తయారుచేయమని ఆదేశించండి. అవసరమైతే విగ్రహం తయారుచేసేటప్పుడు మీరు కూడా పక్కనే ఉండి వారిని గైడ్ చేయచ్చు. ఇలా చిన్నారులు తమ చిట్టి చేతులతో తయారుచేసిన గణపయ్యని పూజా మండపంలో పెట్టి పూజిస్తే ఆ పార్వతీ తనయుడే కాదు.. పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు.. తమలో ఉన్న కళానైపుణ్యాలకు మెరుగులు దిద్దుకునేందుకు మరింత కృషి చేస్తారు.

వివిధ రూపాల్లో..గణేశుని ప్రతిమ అనగానే మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవి మాత్రమే చాలామందికి గుర్తొస్తాయి. కానీ వీటన్నింటికీ భిన్నంగా చాలా సులభంగా కూడా పర్యావరణహితమైన గణనాథున్ని తయారుచేయచ్చు. రావి చెట్టు ఆకులు, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూసలు, క్విల్లింగ్ పేపర్స్.. మొదలైనవి ఉపయోగించి కూడా ఆకర్షణీయమైన రూపంలో ఆ ఆదిదేవునికి రూపమివ్వచ్చు. అలాగే ఇంట్లో లభ్యమయ్యే రకరకాల పప్పు దినుసులను ఉపయోగించి కూడా విఘ్నాధిపతిని తయారుచేయచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా ఒక పేపర్ మీద బొజ్జ గణపయ్య ఆకృతి గీసి రకరకాల పప్పులు అతికించడం ద్వారా దానిని చూడచక్కగా తీర్చిదిద్దడమే.. ఇలాంటి సరదా పనులను పిల్లలకు చెప్పడం ద్వారా వారి సృజనాత్మకతకు మెరుగులు దిద్దడంతోపాటు ఆ భగవంతునికి సంబంధించిన విశేషాలను కూడా తెలియజేయచ్చు.

మండపం అలంకరణ..ప్రతిమ తయారీలోనే కాదు.. రకరకాల డెకరేటివ్ ఐటమ్స్‌తో మండపం అలంకరించడంలో కూడా పిల్లల్ని భాగస్వాముల్ని చేయచ్చు. మండపాన్ని ఎలా అలంకరిస్తే అందంగా ఉంటుంది, ఆకర్షణీయమైన లుక్ కోసం ఎలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఉపయోగించాలి.. మొదలైన అంశాల మీద వారికీ ఒక అవగాహన ఏర్పడుతుంది. అదీకాక సృజనాత్మకంగా ఆలోచించే తీరు వారికి అలవడుతుంది. ఇందులోభాగంగా స్వామివారికి అలంకరించే పాలవెల్లిని తయారుచేయడం, వివిధ పండ్లతో అలంకరించడం, మామిడాకులు కట్టడం, గణనాథుని ఆసనాన్ని తయారుచేయడం, హారతి పళ్లాన్ని అలంకరించడం.. మొదలైన పనులు చిన్నారులతో చేయించవచ్చు. అయితే ఇవన్నీ చేసే క్రమంలో వారిని ఓ కంట కనిపెడుతూనే తగిన ప్రోత్సాహం కూడా అందించాలి సుమా!

వంటకాల తయారీ..ఏంటీ.. 'పిల్లలతో వంటకాలేం తయారు చేయిస్తాం. వారికి రావుగా..' అని ఆలోచిస్తున్నారా?? వంటకాలంటే వెజ్‌బిర్యానీనో లేక బాసుందీనో కాదు.. సింపుల్‌గా ఉండే స్వీట్స్ ఎలా తయారు చేయాలో వారికి వీడియోల ద్వారా చూపించి, వివరిస్తే తప్పకుండా చిన్నారులు ఆ స్వీట్లను చేయడానికి ప్రయత్నిస్తారు. కొబ్బరి ఉండలు, మోదక్, పాయసం.. వంటి సులభంగా చేయగలిగిన స్వీట్లను వారితో తయారు చేయించి గణపయ్యకి నైవేద్యంగా పెడితే వారు ఆనందించడంతోపాటు వంట చేయడం కూడా వారికి అలవడుతుంది. ఇది ఎప్పటికైనా వారికి ఉపయోగపడక మానదు. అయితే చిన్నారులకి స్వీట్ తయారుచేసే పని అప్పగించి మీ పనుల్లో మీరు ఉంటామంటే కుదరదు. మీ పర్యవేక్షణలోనే వారిని ఇవన్నీ తయారుచేయమని కోరాలి. వారి సందేహాలు నివృత్తి చేస్తూ వంట చేసే సులభమైన పద్ధతులను వివరిస్తే తప్పకుండా వారు ఇలాంటి పనులు చేయడం పట్ల ఆసక్తి చూపిస్తారు.

శ్లోకాలు.. పాటలు పాడించండి..వినాయకుడి పూజ చేసే క్రమంలో పిల్లలతో కూడా శ్లోకాలు చెప్పించండి. వాటి అర్థాన్ని వారికి వివరిస్తూ ఎలా పలకాలో స్పష్టంగా చెబితే వారు కూడా తదనుగుణంగా శ్లోకాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. కేవలం శ్లోకాలే కాదు.. గణేశుడికి సంబంధించిన భక్తిపాటలను కూడా వారితో పాడించవచ్చు. ఫలితంగా వారికి సంగీతంపై మక్కువ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details