తెలంగాణ

telangana

ETV Bharat / city

అంగన్‌వాడీ కేంద్రాలకు మూడు నెలలుగా నిలిచిన పాల సరఫరా! - తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాల వార్తలు

అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ప్రతిరోజూ గుడ్డు, 200 మి.లీ. పాలు తప్పనిసరిగా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సమయంలో మూడు నెలలుగా పిల్లలకు పాలు అందకపోవడం గమనార్హం. జనవరిలో 10 శాతం మందికి సరఫరా కాగా.. ఫిబ్రవరిలో ఇప్పటికీ 2 శాతం కూడా అందలేదని గణాంకాలు చెబుతున్నాయి.

from the Three months supply of milk to Anganwadi Centers are stopped in telangana
అంగన్‌వాడీ కేంద్రాలకు మూడు నెలలుగా నిలిచిన పాల సరఫరా

By

Published : Feb 22, 2021, 6:57 AM IST

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా నిలిచిపోయింది. గుత్తేదారుల గడువు గత ఏడాది అక్టోబరుతో ముగిసింది. ఆ తరువాత ఒక నెల సరఫరా చేశారు. పూర్తిస్థాయి డిమాండ్‌ 25 లక్షల లీటర్లు కాగా.. డిసెంబరులో 7.5 లక్షల లీటర్లు, జనవరిలో 2.39 లక్షల లీటర్లు, ఫిబ్రవరిలో 68 వేల లీటర్లు మాత్రమే సరఫరా అయింది. టెండర్లలో అధిక ధరల కోసం గుత్తేదారులు సిండికేట్‌ కావడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో మూడు నెలలుగా పాలు అందక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.

మూడు నెలలుగా..

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఎత్తుకు తగిన బరువు లేక ఎదుగుదల లోపం గణనీయంగా పెరుగుతోంది. 2019-20 నాటికి ఇది 28 శాతం నుంచి 33.1 శాతానికి చేరింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సీఎం ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ప్రతిరోజూ గుడ్డు, 200 మి.లీ. పాలు తప్పనిసరిగా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సమయంలో మూడు నెలలుగా పిల్లలకు పాలు అందకపోవడం గమనార్హం. జనవరిలో 10 శాతం మందికి సరఫరా కాగా.. ఫిబ్రవరిలో ఇప్పటికీ 2 శాతం కూడా అందలేదని గణాంకాలు చెబుతున్నాయి.

ఎందుకీ పరిస్థితి?

* గర్భిణుల్లో రక్తహీనత, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారుల్లో పౌష్టికాహారలోపం నివారణకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు మహిళా శిశు సంక్షేమ శాఖ రోజూ గుడ్డుతో పాటు 200 మి.లీ. పాలు, చిన్నారులకు నెలకు 14 గుడ్లుతో పాటు 100 మి.లీ. పాలు ఇస్తోంది. ఇందుకు ప్రతినెలా కనీసం 25 లక్షల లీటర్ల పాలు అవసరం.

* ఇక తాజా ప్రణాళిక ప్రకారం 200 మి.లీ. చొప్పున సరఫరా చేసేందుకు మరో 5 లక్షల లీటర్లు అవసరం. ఈమేరకు టెట్రాప్యాక్‌ పాల సరఫరా రాష్ట్రంలో లేదు.

* పాల కొరత నివారణకు మహిళాశిశు సంక్షేమశాఖ విజయ డెయిరీని సంప్రదించగా తమ డెయిరీ సామర్థ్యం 7 లక్షల లీటర్లని.. రెండు, మూడు రోజుల్లో బిల్లు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని తేల్చిచెప్పింది. కానీ బిల్లులు 3 నెలలకోసారి మంజూరవుతుండడంతో అది కార్యరూపం దాల్చలేదు.

* గుత్తేదారు సంస్థలు కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి లీటరు లేదా 200 మి.లీ. టెట్రాప్యాక్‌లో సమీకరించి సరఫరా చేస్తున్నాయి. ఇందుకు అదనంగా రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

* విజయ డెయిరీ నుంచి సరఫరాకు లీటరుకు సగటున రూ.11, పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరాకు రూ.13 చొప్పున తీసుకుంటున్నాయి.

* గుత్తేదారుల గడువు ముగియడంతో సవరించిన నిబంధనల ప్రకారం మహిళా శిశు సంక్షేమ శాఖ టెండర్లు పిలిచింది. తక్కువ రవాణా ఛార్జీలతో గుత్తేదారులు ముందుకు వస్తారని భావించింది. గుత్తేదారు సంస్థలు సిండికేట్‌గా ఏర్పడి గత ఏడాది సరఫరా ఛార్జీల కన్నా ఎక్కువగా కోట్‌ చేశాయి. దీంతో శిశు సంక్షేమశాఖ వెనక్కు తగ్గింది. మరోవైపు టెండరులో తక్కువ ధర పేర్కొన్నవారికి అప్పగించాలంటూ గుత్తేదారు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

ఇదీ చూడండి: బాలికపై యాసిడ్​ దాడి.. పరిస్థితి విషమం!

ABOUT THE AUTHOR

...view details