ఏపీలోని విజయవాడకు తూర్పు వైపు నిర్మించాలనుకుంటున్న మరొక బైపాస్‌కు అధికారులు 4 ప్రతిపాదనలు చేశారు. ఇందులో గన్నవరం అవతల జాతీయ రహదారి-16లోని పొట్టిపాడు నుంచి గుంటూరు వైపు కాజ వరకు 40 కి.మీ.మేర ఉన్న ప్రతిపాదనపై ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఆసక్తి చూపుతున్నారు. దీనికి మద్దూరు వద్ద కృష్ణా నదిపై వంతెన నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. మిగిలిన 3 ప్రతిపాదనలకంటే ఇది సరైనదనే అభిప్రాయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల వద్ద వ్యక్తం చేశారు. ఈ రహదారి నిర్మాణానికి రూ.1,200-1,500 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. భూసేకరణకు రూ.400-500 కోట్లు అవసరం కాగా.. దీన్ని రాష్ట్రమే భరించాల్సి ఉంది.
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ భారాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సీనరేజ్ ఫీజు, జీఎస్టీ మినహాయించాలని కేంద్రం కోరగా.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. కొత్త రహదారిలో సీనరేజ్, జీఎస్టీ తదితరాలన్నీ మినహాయిస్తే రూ.100 కోట్లు ఎన్‌హెచ్‌ఏఐకి కలిసొస్తాయి. అయితే ఈ ప్రాజెక్టులో భూసేకరణ వ్యయం రూ.500 కోట్ల వరకు ఉండటంతో రాష్ట్రంలోని ఇతర ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టుల్లో కూడా సీనరేజ్, జీఎస్టీ మినహాయింపులనివ్వాలని కేంద్రం కోరుతున్నట్లు తెలిసింది. ఈ అంశాన్ని రాష్ట్రం పరిశీలిస్తోంది.