కరోనా కారణంగా మార్చిలో పలు సంస్థలు ప్రాంగణ నియామకాలను నిలిపివేశాయి. అమెరికా, యూరప్ దేశాల నుంచి ప్రాజెక్టులు రాకుంటే ఇప్పటికే ఎంపికైన వారికీ కొలువులు కష్టమని ప్రచారం సాగింది. కొన్ని ఐఐటీల్లో ప్రాంగణ నియామకాలను చేపట్టిన కంపెనీలు వాటిని రద్దు చేసుకుంటున్నామని అధికారికంగా సమాచారం ఇచ్చాయి.
కేంద్ర మానవ వనరుల శాఖ సైతం మరోసారి నియామకాలను చేపట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థల్లో కొలువులకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థులు ఆందోళన చెందారు. తాజాగా ఐటీ కంపెనీల నుంచి వస్తున్న సమాచారం అభ్యర్థులకు ఊరటనిస్తోంది
ఆయా ఇంజినీరింగ్ కళాశాలల ప్లేస్‌మెంట్ అధికారులకు కంపెనీల ప్రతినిధులు ఫోన్ చేసి బీటెక్ చివరి ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు ఎప్పుడు పూర్తవుతాయి? వారు ఎప్పుడు విధుల్లో చేరుతారో చెప్పాలని అడుగుతున్నారు. ఇంటర్న్‌షిప్‌లకు ఎంపికైన విద్యార్థులకు ఆయా సంస్థల మానవ వనరుల విభాగం అధికారులు నేరుగా ఫోన్లు చేస్తున్నారు. ఐటీ సంస్థల అధికారులు ఫోన్లు చేసి తాజా పరిస్థితిని తెలుసుకుంటున్నారని వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల ప్లేస్‌మెంట్ అధికారి పార్థసారథి, సీబీఐటీ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి ఎన్‌ఎల్‌ఎన్ రెడ్డి తెలిపారు.
కొన్ని సంస్థలు మాత్రం ఇంతకుముందు జులైలో చేరాలని చెప్పామని, ఒకటీ రెండు నెలలు ఆలస్యమవుతుందని చెబుతున్నాయని పార్థసారథి పేర్కొన్నారు. ‘పరీక్షలు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరొచ్చని ఫోన్లు వస్తున్నాయి. పరీక్షలు నిర్వహిస్తారో.. రద్దు చేస్తారో ప్రభుత్వం తేల్చడం లేదు’ అని హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ఏనుగు శ్రీరాగ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు.