తెలంగాణ

telangana

ETV Bharat / city

Fresh Serve : ఈ ముగ్గురు స్నేహితులు కొవిడ్ బాధితుల ఆకలి తీర్చారు.. - fresh serve provides food for corona patients in Hyderabad

కొవిడ్‌ బాధితుల ఆకలి తీర్చాలన్న సంకల్పం... ఆ ముగ్గురు స్నేహితులనీ ముందుకు నడిపించింది. చదువుకుంటూనే సేవకు సై అన్న ఈ మిత్రత్రయం.. లాక్​డౌన్​లో ఎంతో మంది కడుపు నింపింది. వీరి సేవలకు ఫిదా అయిన సూపర్ స్టార్ మహేశ్​ బాబు ఆయన సతీమణి వారు చేస్తున్న మంచి పనికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Fresh serve, nutrition for corona victims
ఫ్రెష్ సర్వ్, కరోనా బాధితులకు పోషకాహారం

By

Published : Jun 20, 2021, 11:19 AM IST

సంహిత, నిత్యశ్రీ, గాయత్రి... చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిలో ఇద్దరు అమెరికాలో, మరొకరు కెనడాలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చదువుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌కు ముందు వీళ్లు స్వస్థలం హైదరాబాదుకు వచ్చేశారు. ఇక్కడ ఇంటర్న్‌షిప్‌ చేస్తూ.. పలు కోర్సులు నేర్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండటం, ఎంతోమంది పౌష్టికాహారం లేక పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. ఆకలితో అలమటిస్తున్న వారికోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘ఫ్రెష్‌ సర్వ్‌’ అనే వేదికకు ఊపిరి పోశారు. కొవిడ్‌ బారినపడి హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నవారికి ఆహారం అందించాలని అనుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ‘ఫ్రెష్‌ సర్వ్‌’ పేరిట పేజీలు క్రియేట్‌ చేసి ఆహారం కోసం తమను సంప్రదించాలని చెప్పడం ప్రారంభించారు. తెలిసిన వారికి మెసేజులూ పంపేవారు. అలా మే ఒకటిన తొలి రోజు ఎవరికి వారు వాళ్ల ఇళ్లలోనే భోజనం సిద్ధం చేసి ఎనిమిది మందికి అందించారు.

రెండో రోజు నుంచి సాయం కోసం అభ్యర్థనల సంఖ్య పెరుగుతూ వెళ్లింది. వారందరి కోసం ఇంట్లో వండటం ఈ అమ్మాయిలకు శక్తికి మించిన పనైంది. దీంతో మాదాపూర్‌లోని ఓ కిచెన్‌ను సంప్రదించారు.

తాము భోజనం అందించేది కరోనా బాధితులకు కాబట్టి వారు త్వరగా కోలుకునేలా అందులో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూస్తున్నారు. ‘కిచెన్‌ నిర్వాహకులకు డబ్బులు చెల్లించి భోజన పొట్లాలు చేయిస్తాం సరే... మరి పంపిణీ ఎలా?’ అని ఆలోచించారు. తొలుత ర్యాపిడో, ఓలా, ఉబర్‌ సంస్థల సాయం తీసుకున్నారు. తరువాత వీరి సేవలు తెలిసిన కొందరు వాలంటీర్లుగా పంపిణీ బాధ్యతలను తీసుకున్నారు. ఖర్చంతా ఎక్కువగా వీరే పెట్టుకుంటున్నారు. అప్పుడప్పుడూ కొద్ది మొత్తం విరాళాలు అందుతున్నాయి. ప్రస్తుతం నగరంలో రోజూ 350 ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు.

సంహిత, నిత్యశ్రీ, గాయత్రిల సేవలను హీరో మహేశ్‌బాబు సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభినందించారు. అంతేకాదు, వారు చేస్తున్న మంచి పనికి మహేశ్‌, తాను అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details