నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఆర్థికవేత్త ఎస్తర్ డఫ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమె సోమవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారత అంశాల్లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. అనంతరం ఆమెకు జ్ఞాపికను అందజేసి సన్మానించారు.
ఈ భేటీ అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మతో ఎస్తర్ డఫ్లో బృందం భేటీ అయ్యింది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలు, వాటిని చేరుకునేందుకు ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను సీఎస్ ఆమెకు వివరించారు. పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుని.. వాటిని అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాల్ని రూపొందించారంటూ ఆమె ముఖ్యమంత్రిని కొనియాడారని సీఎం కార్యాలయం ప్రకటనలో వివరించింది.