కంటోన్మెంట్‌లో 4 లక్షలకుపైగా జనాభా ఉంది. 33,300 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ప్రజల మంచినీటి అవసరాలకు కంటోన్మెంట్ బోర్డు, జలమండలి నుంచి రోజూ 59 నుంచి 63 లక్షల గ్యాలన్ల నీటిని కొని, సరఫరా చేస్తోంది. ఇందుకు జలమండలి కిలో లీటరుకు రూ.13.50 చొప్పున వసూలు చేస్తోంది. అదనంగా సరఫరా చేస్తే రెట్టింపు చెల్లించాలి. తద్వారా బోర్డుకు ప్రతినెల సుమారు రూ.కోటికి పైగా వ్యయమవుతోంది. కానీ, బిల్లుల వసూళ్లు అంతంతే. మరోవైపు.. 53 శాతం నీటికి జలమండలి కిలో లీటరుకు రూ.7 చొప్పున వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని నేతలు హామీలు ఇచ్చి రెండేళ్లకుపైగా అవుతున్నా.. నెరవేరడం లేదు.
కంటోన్మెంట్‌వాసులను చేరని ఉచిత నీటి పథకం - కంటోన్మెంట్ వార్తలు
హైదరాబాద్ నడిబొడ్డులో ఉండే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కొన్ని వర్తించకపోవడం స్థానికులకు శాపంగా మారుతోంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకు 20 వేల లీటర్లలోపు ఉచితంగా నీటి సరఫరా పథకం అమలుకు అడుగులు పడ్డాయి. నల్లాలకు మీటర్ల బిగింపు, ఆధార్ అనుసంధానం వేగవంతమైంది. కంటోన్మెంట్‌లో ఆ ఊసేలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
బోర్డుపై భారం..
ఎనిమిది పంప్‌హౌస్‌ల నిర్వహణ, కొత్త పైప్‌లైన్ల ఏర్పాటు, నీటి సరఫరాకు విద్యుత్తు బిల్లులు తదితరాలకు బోర్డుకు ప్రతినెల రూ.కోట్లలో వ్యయమవుతుంది. ఇంత చేస్తున్నా బోర్డు నుంచి.. జలమండలి కిలో లీటరుకు రూ.13.50 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో భారం పడుతోందని బోర్డు అధికారులు వాపోతున్నారు. తాజాగా ఉచిత నీటి పథకంతో ఉపశమనం లభిస్తుందని స్థానికులతోపాటు బోర్డు అధికారులూ భావించారు. కానీ.. కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతం.. పథకానికి నోచుకోలేదు. కంటోన్మెంట్‌కూ వర్తింపజేయాలని పలుమార్లు జలమండలికి లేఖలు రాసినా, ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ తెలిపారు.