తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రయాణికులకు ఆర్టీసీ ఉచిత సర్వీస్​.. ఎంజీబీఎస్​కు వెళ్లే వారికే ఈ ఆఫర్​..! - ఎంజీబీఎస్​కు వెళ్లే వారికే ఈ ఆఫర్​

Free Electric Vehicle In MGBS: ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ అనేక వినూత్న కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో భాగంగా ఎంజీబీఎస్ ఆవరణలో ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఎటువంటి వ్యయప్రయాసాలు లేకుండానే బస్టాండ్ నుంచి బయటకు వచ్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఈ సర్వీస్ చాలా బాగుందని ప్రయాణికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

free-electric-vehicle-for-passengers-at-mgbs
free-electric-vehicle-for-passengers-at-mgbs

By

Published : Feb 2, 2022, 8:45 PM IST

Free Electric Vehicle In MGBS: రాష్ట్రంలోనే అతి పెద్ద బస్టాండ్ అయిన ఎంజీబీఎస్ నుంచి ప్రతి రోజూ సుమారు 3,400ల బస్సులు సుమారు 35వేల పైచిలుకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తాయి. పండుగల రోజులైతే సుమారు 60వేల మంది వరకు ప్రయాణికులు ఎంజీబీఎస్ నుంచి ప్రయాణం సాగిస్తుంటారు. ఎంజీబీఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాకట, తమిళనాడు, మహారాష్ట్రకు కూడా బస్సులు నడుస్తుంటాయి. ఇంత సంఖ్యలో ప్రయాణికులు ఉన్న బస్టాండ్​లో వారి సౌకర్యార్థం ఏదో ఒకటి చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అనేకసార్లు ఈ అంశంపై చర్చించిన తర్వాత.. విద్యుత్ వాహనం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అందరి నుంచి వ్యక్తమైంది.

ప్రతిరోజూ 100 నుంచి 120 ట్రిప్పులు..

ఐదు లక్షల రూపాయలతో ఒక విద్యుత్ వాహనాన్ని కొనుగోలు చేసి.. జనవరి మొదటి వారం నుంచి విద్యుత్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్​ లోపలికి వచ్చే ప్రయాణికుల కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి ఐదు నిమిషాలకు ఈ వాహనం అందుబాటులో ఉంటుంది. ఆర్టీసీ బస్సులు నడిపించే ఇద్దరు డ్రైవర్లను ఈ-వాహనం కోసం కేటాయించారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ-వాహనం అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ వంద నుంచి 120 ట్రిప్పులు వేస్తుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఒక్కో ట్రిప్పులో 8 నుంచి పది మంది వరకు ప్రయాణికులను తీసుకెళ్తుంటామన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా ఈ వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది. వాహనం ఖాళీగా ఉంటే.. ఎవరినైనా తీసుకెళ్తున్నామని చెబుతున్నారు.

ఆ ఇబ్బందులు తప్పాయి..

లోకల్ ఆర్టీసీ బస్సు నుంచి దిగిన తర్వాత తమ లగేజీని లోపలి వరకు మోసుకెళ్లడం ఇబ్బందికరంగా ఉండేదని... ప్రస్తుతం ఉచిత వాహనం అందుబాటులోకి రావడం వల్ల ఆ ఇబ్బందులు తగ్గిపోయినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. గతంలో సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్​కు వెళ్లేందుకు రోడ్డు దాటే క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగేవని.. ఈ-వాహనం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ తిప్పలు తప్పిపోయాయంటున్నారు.

ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు..

"రోడ్డు మీది నుంచి బస్టాండ్​ లోపలి వరకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కాళ్ల నొప్పులతో.. లగేజీ భారంతో.. పిల్లలతో.. అంత దూరం నడవాలంటే కష్టంగా ఉండేది. వచ్చే పోయే వాహనాలను దాటుకుంటూ పోవటం కష్టంగా ఉండేది. ఆటోల్లో వెళ్దామంటే డబ్బులు ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు ఈ- వాహనం వల్ల ఆ బాధలన్ని పోయినట్టే. చాలా సంతోషంగా ఉంది. ముసలివాళ్లకు, గర్భిణీలకు, లగేజీతో వచ్చే వాళ్లకు ఈ సర్వీస్​ చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ సర్వీస్​ను అందుబాటులోకి తెచ్చినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు."

- ప్రయాణికులు

ప్రస్తుతం ఒక్కటే విద్యుత్ వాహనం ఉందని.. ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మరో విద్యుత్ వాహనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ సైతం ఇప్పుడు ఉన్న వాహనానికి ఆదరణ బాగానే ఉందని..మరో వాహనాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details