Free Drinking Water Supply Hyderabad : నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తాం.. మీ క్యాన్(వినియోగదారుల ఖాతా సంఖ్య)ను ఆధార్‌ను అనుసంధానం చేయండని 13 నెలల కిందట గృహ వినియోగదారులకు జలమండలి పిలుపిచ్చినా గ్రేటర్‌లో ఇప్పటికి 50 శాతం మందే ముందుకొచ్చారు. ఈ నెల 31వ తేదీతో అనుసంధానం గడువు ముగియనుంది. ఆలోగా ప్రక్రియ పూర్తిచేయని వారు 13 నెలల తాగునీటి బిల్లు కింద రూ.300 కోట్లను చెల్లించాలి. వచ్చే నెల నుంచి బిల్లులను జారీ చేయనున్నారు. అత్యధికంగా సాహెబ్‌నగర్, ఎల్‌బీనగర్ జలమండలి డివిజన్లలో 60 శాతం మంది స్పందించగా, అతి తక్కువగా చార్మినార్ డివిజన్‌లో 21 శాతం మందే అనుసంధానం పూర్తి చేయడం గమనార్హం. బకాయి బిల్లులు భారీగా ఉండే అవకాశం ఉండడంతో చెల్లించడం కష్టమని భావించిన ఆ సంస్థ మరో అవకాశాన్ని ఇచ్చింది.
Free Drinking Water Supply Registration : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్దియా పరిధిలో అందరికీ ఉచితంగా తాగునీటిని ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పథకం వర్తించాలంటే ప్రతి అపార్టుమెంట్‌లోని ఫ్లాట్ యజమాని జలమండలి వెబ్‌సైట్‌లో ఆధార్ సహా ఇతర వివరాలను అనుసంధానం చేయాలన్న నిబంధన పెట్టారు. 2020 డిసెంబరు నుంచి పథకం వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అనుసంధానానికి తుది గడువు 2021 డిసెంబరు నెలాఖరు వరకే ఇచ్చారు. నగరంలో మొత్తం 9.84 లక్షల తాగునీటి కనెక్షన్లు ఉంటే ఇప్పటి వరకు 4.90 లక్షల మందినే అనుసంధానం చేశారు.