కరోనా వేళ స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు చేతనైన సాయం చేసి ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఆహారంతో పాటు రోగులకు కావాల్సిన మందులు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ఆసుపత్రుల్లో పడకలు అవసరమైన వారికి నిర్ధారిత సమాచారం అందిస్తున్నారు. వాటిని సంబంధించిన అభ్యర్థనలు, సేవలు ఎక్కువగా సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్నాయి. అయితే కొందరు కేటుగాళ్లు బాధితుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఫోన్లు చేస్తున్నామంటూ నమ్మిస్తూ వారి నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నారు. రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, టోసిలిజుమాబ్ తదితర ఇంజక్షన్లు కావాలంటూ ఫోన్ నంబర్, దవాఖానాతో పాటు ఇతర వివరాలను అందులో పోస్ట్ చేస్తుండటంతో కేటుగాళ్లు నేరుగా బాధితులకు ఫోన్ చేసి నగదు బదిలీ చేయాలని చెబుతున్నారు.
నేరుగా ఆసుపత్రికే పంపుతామంటూ...
బ్లాక్‌ఫంగస్ బారిన పడిన ఓ వ్యక్తి నగరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. లిపోసోమల్ ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యులు సూచించడంతో సామాజిక మాధ్యమాల్లో సాయం చేయమంటూ పోస్ట్ పెట్టారు. కొద్ది సమయం తర్వాత డబ్బు పంపిస్తే నేరుగా ఆసుపత్రికే ఇంజక్షన్ వయల్స్‌ను పంపుతామంటూ చెప్పారు. బయటి మార్కెట్‌లో ప్రయత్నించినా లభ్యం కాకపోవడంతో వాళ్లకు ఆ ఫోన్‌కాల్ ఎంతో ఊరటనిచ్చింది. వెంటనే చెప్పిన ఖాతాకు డబ్బు పంపారు. రాత్రి వరకు వేచి చూసినా రాకపోవడంతో మోసపోయామని గ్రహించారు.