ఈఎస్‌ఐ అవకవతకల కేసులో శుక్రవారం ఉదయం 7 గంటల 20 నిమిషాలకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన పోలీసులు... రోడ్డు మార్గం ద్వారా 480 కిలోమీటర్లు ప్రయాణించి సుమారు రాత్రి 7 గంటలకు గొల్లపూడిలోని విజయవాడ రేంజ్ అనిశా కార్యాలయానికి తీసుకొచ్చారు. అచ్చెన్నాయుడుకు న్యాయసాయం అందిస్తామంటూ అక్కడికి చేరుకున్న న్యాయవాదులను సైతం పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తమను అనుమతించకపోవటంపై ఆగ్రహించిన న్యాయవాదులు... దీనిపై కోర్టులో కేసు వేస్తామని స్పష్టం చేశారు.
వైద్యపరీక్షలు..
గొల్లపూడిలోని అనిశా కార్యాలయంలో అచ్చెన్నాయుడుకు ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహించారు. మరోసారి పరీక్షల నిర్వహణకు ఆయనతో పాటు మిగిలిన ఆరుగురు నిందితులనూ ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం వారిని... విజయవాడలోని అనిశా న్యాయస్థానానికి తరలించారు. అచ్చెన్నాయుడుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించారు.
తెదేపా నేతల అడ్డగింత..
అనిశా న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా... అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సహా పలువురు పార్టీ నేతలు అక్కడికి చేరుకున్నారు. వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాము కేవలం పరామర్శకే వచ్చామని తెదేపా నేతలు చెప్పినా... ఎంతకీ అనుమతించలేదు. పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం అనంతరం లోకేశ్ సహా నేతలంతా వెనుదిరిగారు.