రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తైంది. జులై 1న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పదిరోజుల పాటు సాగింది. ఈ పదిరోజుల పాటు జరిగిన పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో భాగంగా జీహెచ్ఎంసీ మినహా 141 నగర, పురపాలికల్లో 31వేల టన్నుల మేర చెత్త ఎత్తిపోసినట్లు పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. 16 వేల టన్నుల శిథిలాలు, వ్యర్థాలను తొలగించినట్లు చెప్పారు. 13 వేలకు పైగా కిలోమీటర్ల మేర మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీయడం సహా చెత్త తొలగించినట్లు పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న 1,445 ఇళ్లను తొలగించినట్లు చెప్పారు.
నీరు నిలిచే అవకాశం ఉన్న, నిలిచిన 5,520 ప్రాంతాల్లో మొరం పోసి చదును చేసినట్లు సీడీఎంఏ తెలిపారు. రహదారుల మధ్యలో, ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో 14.66 లక్షల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. దాంతోపాటు 44.50 లక్షల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేసినట్లు తెలిపారు.