ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు బాలాజీనగర్‌కు చెందిన జయలక్ష్మికి ఇద్దరు కుమారులు. పెద్దోడు రామిరెడ్డి, చిన్నోడు శ్రీధర్‌రెడ్డి.. వివాహాలు చేసుకున్న తరువాత ఒకే ఇంట్లో ఉంటున్నారు. పిల్లాపాపలతో సంతోషంగా బతుకుతున్న ఆ ఉమ్మడి కుటుంబాన్ని కరోనా(Corona) కాటు వేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఇంటి పెద్ద జయమ్మ, ఆమె ఇద్దరు కుమారులు సహా నలుగురుని బలి తీసుకుంది. దాదాపు రూ.20 లక్షలు దాకా ఖర్చు చేసినా ఒక్కరి ప్రాణమూ దక్కలేదు. అటు ఆర్థికంగానూ, మానసికంగానూ ఆ కుటుంబం దీనస్థితిలోకి వెళ్లిపోయింది.
పెద్ద కుమారుడు రామిరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు ఉదయేశ్వర్‌రెడ్డి సంతానం. చిన్నకుమారుడు శ్రీధర్‌రెడ్డి, సుజాత దంపతులు.. సాహిత్య, రామవర్ధన్‌రెడ్డికి జన్మనిచ్చారు. ఈ కుటుంబంలో తొలుత శ్రీధర్‌రెడ్డికి కరోనా వచ్చింది. కర్నూలు సర్వజన వైద్యశాలలో చేర్చించగా.. 2 రోజులు మృత్యువుతోపోరాడి.. ఏప్రిల్ 25న మరణించారు. కొడుకు మరణించిన 5 రోజులకే తల్లి జయలక్ష్మి ఇంట్లోనే మరణించింది. శ్రీధర్‌రెడ్డికి వైద్యసేవలు అందించే క్రమంలో సోదరుడు రామిరెడ్డి కరోనా బారినపడ్డారు. కొద్దిరోజుల తేడాలోనే శ్రీధర్‌రెడ్డి భార్య సుజాత పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వీరి పరిస్థితి విషమంగా మారటంతో.. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. మే 7వ తేదీన రామిరెడ్డి, మే 20న సుజాత.. కరోనా చేతిలో ఓడిపోయారు. ముగ్గురు చిన్నారులు, రామిరెడ్డి భార్య విజయలక్ష్మి కరోనాను జయించారు. శ్రీధర్‌రెడ్డి, సుజాత మరణంతో.. సాహిత్య, రామవర్థన్‌రెడ్డి అనాథలయ్యారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి విజయలక్ష్మి పెద్దదిక్కుగా మారారు. ఫినాయిల్ డిస్ట్రిబ్యూటర్‌గా రామిరెడ్డి, రియల్‌ఎస్టేట్ బ్రోకర్‌గా శ్రీధర్‌రెడ్డి పని చేసేవారు. సంపాదించే వీరిద్దరూ మరణించటంతో... పిల్లల భవిష్యత్తుపై విజయలక్ష్మి ఆందోళన చెందుతున్నారు.