Outer Ring Road : ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల ప్రాంతాలకు మహర్దశ - Hyderabad outer ring road
భాగ్యనగర మణిహారంలో మరో కలికితురాయి చేరబోతోంది. ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) ఎక్కాల్సిన అవసరం లేకుండానే కోరిన ప్రాంతాలకు వెళ్లే అవకాశం కలగబోతోంది. ఎందుకంటే.. ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించేందుకు సర్కార్ నిర్ణయించింది.
ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల ప్రాంతాలకు మహర్దశ
By
Published : Jul 15, 2021, 9:33 AM IST
బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్(Outer Ring Road)) చుట్టుపక్కల ప్రాంతాలకు మహర్దశ పట్టబోతోంది. ఈ రహదారికి రెండు పక్కల ఉన్న సర్వీసు రోడ్డును నాలుగు లైన్లుగా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి మొదటి విడతగా రూ.312 కోట్లను కేటాయించింది. ఈ రోడ్డు విస్తరణ వల్ల లక్షలాది మంది వాహనదారులు అవుటర్ మీదకు వెళ్లకుండానే విస్తరించే సర్వీసు దారిగుండా కోరిన ప్రాంతానికి సులభంగా వెళ్లడానికి అవకాశం ఉంది.
ఎక్కడి నుంచి ఎక్కడకు
● నానక్‌రాంగూడ నుంచి నార్సింగి మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు
● నార్సింగి నుంచి కోకాపేట్ మీదుగా కొల్లూరు వరకు
● రెండో దశలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు పనులు చేపడతారు
కనీసం 10 కిలోమీటర్లు..
ఓఆర్‌ఆర్(Outer Ring Road) నిర్మాణం వల్ల వాహనదారులు మహానగరంలోకి రాకుండా నగర శివార్ల నుంచే వేగంగా వెళ్లిపోవడానికి అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం అవుటర్ ఎక్కిన వాహనదారులు సమీపంలోని ప్రాంతాలకు వెళ్లాలన్నా కనీసం 10 కిలో మీటర్ల ప్రయాణించి ఎగ్జిట్ పాయింట్ నుంచి కిందికి దిగాల్సి వస్తోంది. మరోవైపు అవుటర్ సర్వీసు రోడ్డులో వాహనాల రాకపోకలు గత నాలుగైదేళ్లుగా భారీగా పెరిగాయి. పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని సర్వీసు రోడ్డును విస్తరించాలని సర్కార్‌పై అనేకమంది ఒత్తిడి తెస్తున్నారు. దీన్ని విస్తరించాలని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా తక్షణం సర్వీసు రోడ్డును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించి రూ.312 కోట్లను కేటాయించింది. మొదటి దశలో 45 కిలో మీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే దీనికి టెండర్లను పిలిచి గుత్తేదారులను కూడా ఎంపిక చేయడంతో పనులు మొదలయ్యాయి.
కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వం 49 ఎకరాల భూమిని వేలం వేయబోతోంది. ఇక్కడ అనేక ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపెనీలు రాబోతున్నాయి. కోకాపేటతోపాటు సమీపంలోని ప్రాంతాల్లో వచ్చే కొన్నేళ్లలో దాదాపు ఏడు లక్షల కుటుంబాలు నివాసం ఉండేలా గృహ నిర్మాణ ప్రాజెక్టులు మొదలు కాబోతున్నాయని అధికారులు తెలిపారు. సర్వీసు రోడ్డు విస్తరణ వల్ల దీనికి దగ్గరలోని అనేక ప్రాంతాల్లో పరిశ్రమలు, గృహాల నిర్మాణం పెద్దఎత్తున జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికితోడు కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం అతి పెద్ద రెండు పడక గదుల కాలనీని సిద్ధం చేసింది. ఇక్కడ 25 వేల గృహాలను నిర్మించింది. కొల్లూరుకు దగ్గరలోని తెల్లాపూర్‌తోపాటు అనేక ప్రాంతాల్లో భారీఎత్తున అపార్టుమెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. సర్వీసు రోడ్డు విస్తరణ వల్ల లక్షలమంది ఓఆర్‌ఆర్(Outer Ring Road) ఎక్కకుండానే సర్వీస్ రోడ్డులో ఎక్కడికి కావాలంటే అక్కడి వెళ్లడానికి అవకాశం ఏర్పడబోతోంది. కొత్త సర్వీసు రోడ్డు విస్తరణ వల్ల వట్టినాగులపల్లి, ఖానాపూర్, తెల్లాపూర్, కొల్లూరు లాంటి ప్రాంతాలు పెద్దఎత్తున అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నానక్‌రామ్‌గూడ, కోకాపేట, గండిపేట, నార్సింగ్, బండ్లగూడ జాగీర్ ప్రాంతాల రూపురేఖలు మారుతాయి.