రాష్ట్రంలో ప్రస్తుతం ఐదుజిల్లాలకు.. పూర్తిస్థాయి కలెక్టర్లులేరు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శర్మన్ పదవీ విరమణ చేయగా ఆ స్థానంలో ఇతరులు ఎవరినీ నియమించలేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు... అదనపు బాధ్యతలు అప్పగించారు. నెలరోజులుగా ఆయనే హైదరాబాద్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజధాని పక్కనే ఉన్న మరో జిల్లా... మేడ్చెల్ - మల్కాజ్ గిరిది అదే పరిస్థితి. వాసం వెంకటేశ్వర్లను బదిలీచేసినప్పటి నుంచి జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్‌ను నియమించకపోవడం వల్ల ఇన్‌ఛార్జిలతోనే నెట్టుకొస్తున్నారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా గతంలో పనిచేసిన... శ్వేతా మొహంతి కొన్నాళ్లపాటు మేడ్చెల్ కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించగా ఆ తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్‌కి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంటే ఏడాదిన్నరగా... జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్ లేరనే చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా ప్రశాంత్‌జీవన్ పాటిల్... సిద్దిపేటకు బదిలీ అయ్యాక కొత్త వారిని ఎవరినీ నియమించలేదు. జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మకే... అదనపు బాధ్యతలు అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఎంవీ రెడ్డి పదవీవిరమణ చేశాక.. ఆస్థానంలో ఎవరినీ కలెక్టర్‌గా నియమించలేదు. స్థానికసంస్థల అదనపు కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌కే జిల్లా కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. జోగులాంబ గద్వాల జిల్లా పాలనాధికారిగా పనిచేసిన క్రాంతి సెలవుపై వెళ్లగా అదనపు కలెక్టర్ కోయ శ్రీహర్షకే పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.