చేసిన అప్పులు చెల్లించలేక అప్పలరాజు ఏడాదిగా రహస్య జీవితం గడుపుతున్నారు. ఇతను ఇంటర్ వరకు చదువుకున్నారు.. ఆ తరువాత 'రియల్ ఎస్టేట్' వ్యాపారంలోకి దిగారు. కొంత కాలం పాటు వ్యాపారం బాగానే సాగింది. భారీగానే ఆదాయం సంపాదించారు. విజయనగరానికి చెందిన మానస(26)ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. సాత్విక్(6), కీర్తి (5). అయితే కొంత కాలంగా అప్పులు చేయడం ప్రారంభించారు. ఎందుకు ఖర్చుపెడుతున్నాడో ఎవరికీ తెలియకపోయినా...గతంలో బాగా సంపాదించిన నేపథ్యంలో బంధువులు, గ్రామస్థులు అప్పులిచ్చారు. ఆ భారం దాదాపు రూ. కోటి వరకూ ఉన్నట్లు సమాచారం. రుణదాతలకు వడ్డీలు కడుతూ చాలా కాలం నెట్టుకొచ్చారు.
వడ్డీల భారం ఎక్కువ కావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఈ కారణంగానే అప్పల రాజు తండ్రి సన్నిబాబు గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నారు. అనంతరం అప్పలరాజు గ్రామంలో నుంచి వెళ్లిపోయారు. సంవత్సర కాలంగా రహస్య జీవితం గడుపుతున్నారు. అప్పుల వాళ్లకు తెలిస్తే ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో అత్యంత సన్నిహితులకు మాత్రమే తన ఆచూకీ చెప్పేవారు.. ఏమైనా పనులు ఉంటే వారినే కలుస్తూ... వారితోనే మాట్లాడేవారు. ఎవరినీ ఎక్కువగా కలిసేవారు కాదు. తాజాగా గత నెల 20వ తేదీ నుంచి విశాఖ బస్టాండు ఎదురుగా ఉన్న ఒక హోటల్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఒక్కోసారి బయటకు వెళ్లి భోజనం తెచ్చుకుని గదిలోనే తినేవాడని హోటల్ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఆ ముగ్గురూ ఎలా చనిపోయారో?
ఈ నెల రెండో తేదీన భార్యా, పిల్లలు కూడా హోటల్‌కు వచ్చారు. వారందరితో బుధవారం మధ్యాహ్నం వరకు అప్పలరాజు గడిపారు. సాయంత్రం ఐదు గంటలకు హోటల్ సిబ్బంది గది తలుపులు కొడుతుంటే ఎవరూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా అప్పలరాజు ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పలరాజు భార్య, పిల్లలు ఎలా చనిపోయారన్న విషయంపై పోలీసులకు స్పష్టత రావడంలేదు.