Forum for Good Governance: రాష్ట్రంలో స్థిరాస్థిరంగ నియమనిబంధనలు చట్టబద్దంగా అమలు చేసేందుకు ఏర్పాటైన రెరా పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌కు లేఖ రాశారు. రెరా ఏర్పాటు చేసి నాలుగేళ్లైనా ఛైర్మన్, సభ్యులను ఇంతవరకు నియమించలేదని.. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. ఈ రెండింటికి సబంధించి తక్షణమే చర్యలు తీసుకునేట్లు ప్రభుత్వాన్నిఆదేశించాలని లేఖలో కోరారు.
ప్రధానంగా స్థిరాస్థి రంగంలో పారదర్శికత పెంచేందుకు ప్లాట్లు, ఇళ్ల అమ్మకాలపై జవాబుదారీతనం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్థిరాస్థి చట్టం తెచ్చిందని గుర్తుచేశారు. ఆస్తుల కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేందుకు, వివాదాలు ఏవైనా తలెత్తినప్పుడు మధ్యవర్తిత్వం వహించి త్వరగా పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. రెరాకు స్థిరాస్థిలో అపారమైన అనుభవమున్న ఒక అధ్యక్షుడిని, ఇద్దరు సభ్యులను నియమించాల్సి ఉందని... అది జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి స్థాయి ర్యాంకు అధికారిని రెగ్యులేటరీ అధికారిగా నియమించొచ్చని ఆయన వివరించారు.