Capital Expenditure for Telangana: మూలధన వ్యయం కింద రూ.174 కోట్లు కేటాయింపు - capital expenditure for telangana
10:43 September 26
Capital Expenditure for Telangana: మూలధన వ్యయం కింద రూ.174 కోట్లు కేటాయింపు
కరోనా కారణంగా ఆదాయ వనరులు పడిపోయి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న రాష్ట్రాలకు మూలధన వ్యయం సమకూర్చడానికి గత ఏడాది నుంచి అమల్లోకి తెచ్చిన 'స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఎక్స్‌పెండీచర్ ఫర్ 2021-22' కార్యక్రమం కింద కేంద్ర ఆర్థికశాఖ 8 రాష్ట్రాలకు రూ.2,903.80 కోట్లు కేటాయించింది. అందులో భాగంగా తొలివిడత రూ.1,393.83 కోట్లు విడుదల చేసింది.
వీటిలో తెలంగాణకు రూ.174 కోట్లు కేటాయించడానికి ఆమోదముద్ర వేసి రూ.40.20 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని 50 ఏళ్ల కాలానికి వడ్డీలేని రుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తోంది. 2021-22లో అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.15వేల కోట్లను మూడు విభాగాలుగా అందించనుంది. ఇందులో రూ.2,600 కోట్లు ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు, రూ.7,400 కోట్లు దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వనుంది.
మిగతా రూ.5 వేల కోట్లను రాష్ట్రాల పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించిన, నగదీకరించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా అందివ్వనుంది. ఆ సొమ్మును రాష్ట్రాలకు ఇంత అని ఇవ్వకుండా ఏ రాష్ట్రమైతే తొలుత తమ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటకరించి, విక్రయించి, మానిటైజ్ చేసి వస్తుందో దానికి ప్రాధాన్యం ఇస్తారు.