తెలంగాణ

telangana

By

Published : Jul 27, 2021, 7:37 AM IST

ETV Bharat / city

Viveka murder case: 'వివేకా ఇంట్లో పనివారంతా గంగిరెడ్డికి తెలుసు'

ఏపీ మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి ఇంటి వద్ద పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎర్రగంగిరెడ్డికి తెలుసని మాజీ డ్రైవర్ దస్తగిరి తెలిపారు. సీబీఐ దర్యాప్తు త్వరలో పూర్తవుతుందని, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Viveka murder case, cbi investigation
వివేకా హత్య కేసు, సీబీఐ దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి ఇంటి వద్ద పని చేసిన ప్రతి ఒక్కరూ ఎర్రగంగిరెడ్డికి తెలుసని ఈ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి తెలిపారు. పులివెందులలోని తన నివాసంలో దస్తగిరి సోమవారం ‘ఈనాడు- ఈటీవీ భారత్’తో మాట్లాడారు. వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు త్వరలో పూర్తవుతుందని, అప్పుడు అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఆపాలంటూ కోర్టును ఆశ్రయిస్తారా అని అడగ్గా.. తనను ఎందుకు జైలుకు పంపిస్తారని ఎదురు ప్రశ్నించారు. వివేకా వద్ద పంచాయితీలు చేయించుకునేందుకు సునీల్‌కుమార్‌ యాదవ్‌ వచ్చేవారని.. ఆ సమయంలో అతడితో పరిచయం ఏర్పడిందన్నారు.

థర్డ్ డిగ్రీ ప్రయోగించారు

వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌ ప్రమేయం ఉందని కాపలాదారు రంగన్న మీడియాతో చెప్పారు కదా అని ప్రశ్నించగా అది వాస్తవమో కాదో తనకు తెలియదని దస్తగిరి సమాధానమిచ్చారు. రంగన్న అనవసరంగా పేర్లను చెప్పారు.. ఎవరైనా ఒత్తిడి చేస్తే వాటిని బయటకు చెప్పాడా అనేది సీబీఐ అధికారులే తేలుస్తారని పేర్కొన్నారు. సునీల్‌తోపాటు తనపై కూడా సీబీఐ అధికారులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించారని.. వారికి అనుమానాలు, గట్టి ఆధారాలు ఉంటేనే ఇలా చేస్తారని వెల్లడించారు.

దిల్లీలో రెండు నెలల

సీబీఐ దర్యాప్తు కోసం తాను రెండు నెలలపాటు దిల్లీలో ఉన్నానని దస్తగిరి చెప్పారు. లింగాల మండలం మురారి చింతలపల్లెకు చెందిన దస్తగిరి పాతికేళ్ల కిందట పులివెందులకు వచ్చారు. 2016 నుంచి 2018 వరకు వివేకా వద్ద కారు డ్రైవరుగా పనిచేశారు. దస్తగిరిని చాలారోజులపాటు విచారించిన సీబీఐ అధికారులు ఆయన తల్లిదండ్రులు హాజివలి, షర్మీ, భార్యను కూడా పలుమార్లు ప్రశ్నించారు.

వివేకా కుటుంబసభ్యులతో చర్చించిన అధికారులు

వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ అధికారులు సోమవారం పులివెందులకు వెళ్లారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పట్టణంలోని వివేకా నివాసంలో ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, భార్య సౌభాగ్యమ్మతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం సీబీఐ అధికారులు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకుని.. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి, ఆయన భార్య షబానాను విచారించారు. ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టు జడ్జిని కలిసి, జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జికి రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రతులు ఇక్కడికి వచ్చాయా అని ఆరా తీసినట్లు సమాచారం.

ఇదీ చదవండి:KTR: హుజూరాబాద్​పై కేటీఆర్‌ ఫోకస్.. నేడు ప్రధాన కార్యదర్శులతో సమావేశం

ABOUT THE AUTHOR

...view details