Etela Rajender on kcr: శాసనసభకు తమను రాకుండా చేయడం కోసమే సస్పెండ్ చేశారని మాజీమంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. తనతో పాటు ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. కేసీఆర్.. ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో పాల్గొన్న ఈటల... ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమ బిడ్డనైన నన్ను కుట్రతో పార్టీ నుంచి బయటకు పంపారు. హుజూరాబాద్‌లో నా ఓటమికి అన్నిరకాలుగా ప్రయత్నించారు. ఆరు నెలలపాటు అధికార యంత్రాంగాన్ని అక్కడే మోహరించారు. నా ఓటమి కోసం అక్రమంగా సంపాదించిన వందల కోట్లు ఖర్చుపెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నా ఓటమికి కృషిచేశారు. హుజూరాబాద్‌లో నన్ను అణగదొక్కాలని చూశారు. ప్రజలు.. కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకున్నారు. తెలుగు మాట్లాడే ప్రజానీకం గర్వపడేలా హుజూరాబాద్ ప్రజలు తీర్పు ఇచ్చారు. నా విజయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు.
ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే