ప్రత్యక్ష జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సుదీర్ఘ కసరత్తు చేస్తున్న గులాబీ దళపతి.. కొత్త పార్టీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దసరా నాటికి జాతీయ రాజకీయ పార్టీ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. విజయదశమి నాటికి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు కేసీఆర్ చెప్పారని కర్ణాటక మాజీ సీఎం, జేడీయూ నేత కుమారస్వామి వెల్లడించారు. ఈనెల 9న తెరాస జిల్లాల అధ్యక్షులందరూ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి.. కేసీఆర్ వెంటనే జాతీయ రాజకీయాల్లోకి రావాలని ముక్తకంఠంతో కోరారు. త్వరలో తెరాస రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.
జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేసీఆర్... దానికి అనుగుణంగా కొంత కాలంగా వివిధ అంశాలపై విస్తృత సమాలోచనలు జరుపుతున్నారు. భాజపా, కాంగ్రెస్ రెండింటికీ సమదూరం పాటిస్తూ... స్పష్టమైన అజెండాతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రజల్లో ఓ వైపు భాజపాపై తీవ్ర అసంతృప్తి ఉందని... మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం లేదని ..కాబట్టి జాతీయ పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని తెరాస అధినేత గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పట్ల ఎక్కువగా స్పందించకుండా.. భాజపాపై ధ్వజమెత్తి దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించాలనేది కేసీఆర్ ప్రస్తుత వ్యూహం. భాజపా వైఫల్యాలు, మతతత్వ రాజకీయాలు అనే అంశాలపై దేశవ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రణాళికలు చేస్తున్నారు.
తొలిదశలో ఆ అంశాలపై..: తొలి దశలో రైతులు, కార్మికులు, దళితులు, యువతకు సంబంధించిన అంశాలపై ఉద్యమాలను రూపొందించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. దేశంలో సాగునీరు, విద్యుత్ తగినంత అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో భాజపా, కాంగ్రెస్ విఫలమైనందునే రైతులకు కష్టాలు తప్పడం లేదన్న ప్రచారం చేయనున్నారు. త్వరలో హైదరాబాద్‌లో జాతీయ స్థాయి దళిత సదస్సు నిర్వహించాలని భావిస్తున్నారు. దళితబంధు దేశవ్యాప్తంగా అమలు చేయాలని దళితులు డిమాండ్ చేసేలా ఉద్యమాలు చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు తగిన అంశాలపై కేసీఆర్ బృందం అధ్యయనం చేస్తోంది. యువత అసంతృప్తిగా ఉన్న అంశాలపై నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో నెట్ వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అంశాలతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో స్థానికుల ప్రత్యేక డిమాండ్లు, బలమైన ఆకాంక్షలేమిటి.. వాటిపై భాజపాతో పాటు అక్కడి పార్టీల వైఖరి ఏమిటనే అంశాలను గులాబీ పార్టీ పరిశీలిస్తోంది. వాటిపై స్థానిక ప్రజాభాగస్వామ్యంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.