హైదరాబాద్ చుట్టుపక్కలా... హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని అటవీ ప్రాంతాల రక్షణను కట్టుదిట్టం చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాలే అర్బన్ లంగ్స్పేసులుగా మారుతాయని... సంబంధిత అన్ని శాఖలు తమ బాధ్యతగా వీటిని రక్షించాలని కోరారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై అరణ్య భవన్ లో పీసీసీఎఫ్ ఆర్. శోభతో కలిసి, శాంతి కుమారి సమీక్షించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలా వెలుపలా అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులపై ఆరా తీశారు.
'హెచ్‌ఎండీఏ పరిధిలోని అటవీ ప్రాంతాల రక్షణను కట్టుదిట్టం చేయాలి' - hmda news
అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై అరణ్య భవన్ లో పీసీసీఎఫ్ ఆర్. శోభతో కలిసి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలా వెలుపలా అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులపై ఆరా తీశారు.
ఆయా పార్కుల అభివృద్ది నమూనాలు, ఇప్పటిదాకా అయిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీక్షించి... అధికారులు తగిన సలహాలు, సూచనలు చేశారు. ప్రతీ పార్కులో తప్పని సరిగా ఎంట్రీ గేట్, వాకింగ్ పాత్, గజేబో, వ్యూ పాయింట్ ఏర్పాటు మొదటి దశలో ఉండాలని, అటవీ ప్రాంతం అంతా రక్షణ గోడ (చైన్ లింక్ ఫెన్సింగ్, సీ త్రూ వాల్, కందకాలు) తప్పనిసరిగా ఉండాలన్నారు. పార్కు ఏర్పాటు కాకుండా మిగతా అటవీ స్థలాన్ని అంతటినీ కన్జర్వేషన్ జోన్‌గా పునరుద్ధరణ కార్యక్రమాలు, జీవవైవిధ్యం, నీటి వసతి పెరిగే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు.
అటవీ ప్రాంతాల హద్దుల విషయంలో వివాదాలు ఉన్నచోట్ల తక్షణ పరిష్కారం కోసం, న్యాయ పరమైన చర్యల కోసం నిపుణులతో త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వీలున్నంత త్వరగా అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను అందుబాటులోకి తెచ్చేలా పనులు పూర్తి చేయాలని పీసీసీఎఫ్ శోభ సూచించారు.