విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. అధికారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు అక్రమార్కులు. విదేశాల నుంచి మూడో కంటికి తెలియకుండా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. అక్రమ రవాణానే వృత్తిగా ఎంచుకుంటున్న అక్రమార్కులు.. తమిళనాడుకు చెందిన వారినే ఎక్కువగా ఇందుకు ఉపయోగిస్తున్నట్లు కస్టమ్స్ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. బంగారాన్ని ధరించడం ఇక్కడ సంప్రదాయం కావడంతో ఉత్తరభారత దేశం కంటే దక్షిణ భారత దేశంలో వినియోగం అధికం. అందువల్ల బంగారానికి డిమాండ్ ఎక్కువ. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి అనధికారికంగా స్మగ్లింగ్ అయ్యే బంగారంలో ఎక్కువ భాగం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకు చేరుతుంది.
పన్నుల ఎగవేత:
రాజ మార్గాన బయట దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాలంటే ఎక్సైజ్ సుంకం 38.5 శాతం, మరో 3శాతం జీఎస్టీ కట్టాలి. అంటే విదేశాల నుంచి తెచ్చిన బంగారం విలువపై 40శాతానికిపైగా ఎక్సైజ్ సుంకం, జీఎస్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే.. బయట దేశాల నుంచి తెచ్చే బంగారం ధరలు.. స్థానిక ధరల కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కొన్ని సార్లు నష్టమూ రావచ్చు. అక్రమార్కులు విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేస్తున్నారు.
మూడుపూవులు.. ఆరు కాయలుగా..
ఈ ఏడాది కొవిడ్ ప్రభావంతో.. బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అనూహ్యంగా పెరిగి యాభైవేల మార్కు దాటింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దొరికితే దొంగలు.. లేకపోతే దొరలు అన్న చందంగా మూడుపూవులు.. ఆరు కాయలుగా బంగారం అక్రమ రవాణా సాగుతోంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు విమానాశ్రయాల్లో డీఆర్‌ఐ, కస్టమ్స్, సీఐఎస్‌ఎఫ్ అధికారుల నిఘాను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ అక్రమార్కులు తమ ఎత్తులను మార్చుకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. పక్కా సమాచారం ఉంటే తప్ప బంగారం అక్రమ రవాణాదారులు పట్టుబడడం లేదు.