Traditional food items preparing shop: వీరంతా మొన్నటివరకు వంటిళ్లకే పరిమితమైన వారు. భర్తలు తెచ్చే సంపాదనతో నెట్టుకొచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక ఫుడ్ గార్డెన్....నెలకు 12 లక్షల టర్నోవర్..! ఇలా....తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తూనే...సంప్రదాయ వంటల వ్యాపారంలో ఆరితేరారు. మార్కెట్లో నాణ్యమైన సంప్రదాయ వంటలు దొరకడం కష్టమేనన్న ఆలోచనతో తొలి అడుగేశారు కన్యాకుమారి. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురం పరిధిలోని బెలగాం రైల్వేగేటు సమీపంలో ఉండే ఈమె ఇప్పుడు తనతోపాటు ఇరుగుపొరుగు మహిళలనూ ముందుకు నడిపిస్తున్నారు.
300 రకాలకు చేరింది..
ఇంటిపైప్రాంగణాన్ని సంప్రదాయ వంటలతో పాటు బేకరీ పదార్థాల తయారీకి అనువుగా మార్చారు కన్యాకుమారి. బెంగళూరు వెళ్లి కొన్నాళ్ల పాటు శిక్షణ తీసుకుని తోటి మహిళలకు నైపుణ్యం పెంపొందిస్తున్నారు. అలా అర కిలో మినప ఉండలతో మొదలైన సంప్రదాయ వంటకాల "ఫుడ్ గార్డెన్" ఇప్పుడు 300రకాలకు చేరింది. నెలకు ఆరు వేల పెట్టుబడితోప్రారంభమైన వ్యాపారం 12 లక్షలకు వృద్ధి చెందింది.
ఫుడ్ గార్డెన్‌లో తయారైన సంప్రదాయ వంటకాలు పొరుగు గ్రామాల వారికీ అందుబాటులో ఉండేలా పార్వతీపురంలో దుకాణమూ నిర్వహిస్తున్నారు. అంతర్జాలం ఆసరాగా వ్యాపారాభివృద్ధికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు కన్యాకుమారి.
" చాలామంది సంప్రదాయ వంటల తయారీని, రుచిని మర్చిపోతున్నారు. అలాంటి వారికి మన సంప్రదాయ రుచులు, వంటలు గుర్తుపెట్టుకునేందుకు ప్రారంభించాం. ప్రారంభించిన కొత్తలో వంటలు కుదరక రకరకాల ఇబ్బందులు పడ్డాం. సరిగా కొనేవారు కూడా కాదు. రాను రానూ వంటలు బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు అందరూ బాగా ఇష్టపడుతున్నారు." -కన్యాకుమారి 'ఫుడ్ గార్డెన్' నిర్వాహకురాలు.